ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెటర్లను కొన్ని గంటల్లోనే కోటీశ్వరులను చేసే ఒక మంత్ర దండం. క్రికెట్ (Cricket) లో కాస్త ప్రతిభ ఉంటే చాలు ఆ క్రికెటర్‌ను తమ సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీ (Franchise)లు ఎగబడతాయి. 2008లో అరంగేట్రం చేసిన ఈ ధనాధన్ లీగ్... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లను ధనవంతులను మాత్రమే చేయలేదు వారిలోని ప్రతిభను ప్రపంచానికి చాటింది. అటువంటి ఐపీఎల్ మరోసారి ప్లేయర్లపై కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది.
ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరిగే మెగా వేలం (Auction)లో తమకు నచ్చిన క్రికెటర్ల కోసం ఎంతైనా వెచ్చించేందుకు 10 ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. 590 మంది క్రికెటర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రమే అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. ఈ జాబితాలో నలుగురు భారత ప్లేయర్లు ఉండగా... వీరిలో ఇప్పటికే ముగ్గురు టీమిండియా తరఫున కూడా ఆడారు. అదేవిధంగా మరో ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) : ఈసారి వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాళ్ల జాబితాలో భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అందరికంటే ముందున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు జట్టును నడిపించడం ఇతడి బలాలు కావడంతో అయ్యర్‌ను దక్కించుకోవడానికి ఎంతైనా వెచ్చించేందుకు పలు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. 2015 ఐపీఎల్ సీజన్లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ (Delhi Daredevils) తరఫున అరంగేట్రం చేసిన అయ్యర్... ఆ సీజన్లో 437 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన డెబ్యూ (debutant) ప్లేయర్‌గా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్ (Emerging Player of the IPL)గా అవార్డును అందుకున్నాడు.
ఆ తర్వాత 2018లో కెప్టెన్సీ ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకుని నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. 3 సీజన్ల పాటు కెప్టెన్‌గా ఉన్న అతడు... ఢిల్లీని 2020లో ఫైనల్ వరకు చేర్చగా... 2019లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2021 సీజన్‌కు ముందు భుజం గాయం బారిన పడ్డ అతడు భారత్ వేదికగా జరిగిన తొలి ఐపీఎల్ తొలి ఫేజ్‌కు దూరమయ్యాడు.
అదే సమయంలో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలను రిషభ్ పంత్ స్వీకరించాడు. పంత్‌నే సారథిగా కొనసాగించడానికి ఢిల్లీ మేనేజ్మెంట్ మొగ్గు చూపడంతో అయ్యర్ వేలంలోకి రాక తప్పలేదు. ప్రస్తుతం నాయకత్వ సమస్యలు ఎదుర్కొంటున్న పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు అయ్యర్ కోసం గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. వీటితో పాటు ధోని వారసుడి కోసం వెతుకుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కూడా అయ్యర్‌ను తీసుకునే అవకాశం ఉంది.
డేవిడ్ వార్నర్ (David Warner) : డేవిడ్ వార్నర్ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఓవర్సీస్ ప్లేయర్‌గా వార్నర్‌కు పేరుంది. 2014-2020 మధ్య అతడి ఐపీఎల్ గణాంకాలను తీసుకుంటే 52.31 సగటుతో 144.98 స్ట్రయిక్ రేట్‌తో 3,819 పరుగులు చేశాడు. 2014-20 మధ్య ఒక ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ 3,605 పరుగులతో ఉన్నాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో 2018 ఐపీఎల్లో వార్నర్ ఆడలేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఏడు సీజన్లలో ఆరు సీజన్లలో (2021 మినహా) 500 పరుగులకు పైగా సాధించాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపాడు. అయితే 2021లో సన్‌రైజర్స్ విభేదాల కారణంగా మైదానంలో కంటే కూడా ఎక్కువగా డగౌట్‌కే పరిమితమయ్యాడు. అనంతరం జట్టు అతడిని రిలీజ్ చేయడంతో వేలంలోకి వచ్చాడు.
2021లో చెప్పుకోదగ్గ రీతిలో ఆడకపోయినా... ఆ తర్వాత జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఆసీస్ చాంపియన్‌గా నిలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అందులో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో వార్నర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వార్నర్ లాంటి ప్లేయర్ అవసరం ఎంతైనా ఉంది. వార్నర్ కోసం ఆర్సీబీ భారీ మొత్తం చెల్లించే అవకాశం ఉంది.
ఇషాన్ కిషన్ (Ishan Kishan) : ఈసారి ఐపీఎల్లో అత్యధిక ధర పలికే ఆస్కారం ఉన్న మరో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్. ఈ 23 ఏళ్ల ప్లేయర్‌ను 2018లో జరిగిన ఐపీఎల్ ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ రూ. 6.2 కోట్లతో దక్కించుకుంది. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని ఇషాన్ నిలబెట్టుకున్నాడు. 2020 ఐపీఎల్లో సూపర్ షోతో అలరించాడు.
ఆ సీజన్లో ఏకంగా 30 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ముంబై తరఫున 757 పరుగులు సాధించాడు. అయితే తాజాగా అతడిని ముంబై విడుదల చేయడంతో వేలంలోకి వచ్చాడు. వికెట్ కీపింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో ఇతడిని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. ఓపెనర్‌గా వచ్చి తొలి బంతి నుంచి ధాటిగా ఆడటం ఇషాన్ ప్రత్యేకత. ఇతడిపై చాలా ఫ్రాంచైజీల కన్ను పడింది.
దీపక్ చాహర్ (Deepak Chahar) : మొన్నటి వరకు మనకు బౌలర్‌గా తెలిసిన దీపక్ చాహర్... శ్రీలంక, దక్షిణాఫ్రికా పర్యటనల ద్వార తనలో ఆల్‌రౌండర్ ఉన్నాడని అందరికీ గుర్తు చేశాడు. శ్రీలంకతో గతేడాది జరిగిన వన్డేలో సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియాను గెలిపించిన అతడు... ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్‌ను దాదాపుగా గెలిపించే పని చేశాడు.
ఆరంభంలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో దీపక్ చాహర్ సక్సెస్ అవుతున్నాడు. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కీ బౌలర్‌గా ఉన్న అతడు... తాను దక్కించుకున్న 58 వికెట్లలో 42 వికెట్లను పవర్‌ప్లేలోనే తీశాడు. దాంతో ఇతడిని దక్కించుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ జట్లు పోటీ పడుతున్నాయి.
2020, 2021 సీజన్లలో హైదరబాద్‌కు ఆడిన హోల్డర్ 30 వికెట్లు తీయడంతో పాటు 151 పరుగులు కూడా చేశాడు. ఆరడుగులపైన ఉండే హోల్డర్ భారీ షాట్లు ఆడటంలో దిట్ట. చివర్లో వచ్చి భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటంలో ముందుంటాడు. దాంతో ఇతడిని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. రూ. 10 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) : షారుఖ్ ఖాన్... ఇంకా టీమిండియాకు ఆడను కూడా లేదు. అయితేనేం ప్రస్తుతం ఇతడికి ఉన్నంత డిమాండ్ ఏ ప్లేయర్‌కు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఫినిషర్ రోల్‌కు చక్కగా పనికొచ్చే ఈ 6 అడుగుల నాలుగంగుళాల షారుఖ్ ఖాన్ అలవోకగా సిక్సర్లు సంధించగలడు. ఇప్పటికే మరో కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్ అంటూ ప్రశంసలు సైతం అందుకున్నాడు. 2021లో జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ ఇతడిని రూ. 5.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
అయితే ఆ సీజన్లో అతడికి అనుకున్న స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు. అనంతరం షారుఖ్‌ను పంజాబ్ విడుదల చేయడంతో వేలంలోకి వచ్చాడు. 2021లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో, విజయ్ హజారే వన్డే టోర్నీలో సూపర్ షోతో చెలరేగాడు. విజయ్ హజారే టోర్నీ గత రెండు సీజన్లలో ఏకంగా 29 సిక్సర్లతో అదరగొట్టాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చి 6 నుంచి 10 బంతులు ఎదుర్కొని 20 నుంచి 30 పరుగులు సాధించగల ఘనుడు ఈ షారుఖ్ ఖాన్.