ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) కోసం బీసీసీఐ (BCCI) ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రెండు కొత్త జట్లను ఖరారు చేయగా.. ఇక ఆటగాళ్ల రిటెన్షన్ విధానంపై పలు సూచనలను పరిగణలోకి తీసుకొని నిబంధనలను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న 8 జట్లకు తోడు కొత్తగా వచ్చిన రెండు జట్లు చేరాయి. 2011లో నిర్వహించిన లీగ్ ఫార్మాట్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దీంతో, ఐపీఎల్ జట్లన్నీ తమ వ్యూహల్ని ఇప్పటి నుంచే అమలు చేయడానికి రెడీ అయ్యాయ్.
ఆటగాళ్ల రిటెన్షన్ విధానంతో దాదాపు అన్ని జట్లల్లోనూ కొత్త ముఖాలు కనిపించడానికి అవకాశం ఏర్పడినట్టయింది. కొత్త రిటెయిన్ పాలసీ ప్రకారం మెగా ఆక్షన్‌ను నిర్వహించడానికి ముందే పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వీలు లభించింది. ఈ నలుగురిలో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక ఓవర్సీస్ ప్లేయర్/ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు లేదా ఇద్దరు ఓవర్సీస్ క్రికెటర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు.
కొంతకాలంగా ఫామ్‌ను కోల్పోయిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. అతణ్ని ఆక్షన్ కోసం వదిలేస్తుందని చెబుతున్నారు. ఆల్‌రౌండర్ గుర్తింపుతో ముంబై ఇండియన్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది. చాలా ఏళ్లుగా అతను ముంబై ఇండియన్స్ కోసం ఆడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆల్‌రౌండర్ హోదాను కోల్పోయాడు. బౌలింగ్ చేయట్లేదు. బ్యాటింగ్ మీదే ఆధారపడుతున్నాడు.
దేశీయ ప్లేయర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఓవర్సీస్ ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యాలాగా సూర్యకుమార్ యాదవ్ గానీ, ఇషాన్ కిషన్ గానీ ఆల్‌రౌండర్లు కాదు. కీరన్ పొలార్డ్ ఈ హోదాలో కొనసాగుతాడు.దీంతో దాదాపు, హార్దిక్ పాండ్యాను వదిలించుకోవడానికి ముంబై ఇండియన్స్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.