రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇవాళ రాత్రి జరిగే టైటిల్ పోరుతో ఐపీఎల్ 2022 ఎడిషన్ కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్లు టైటిల్ కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడేందుకు సై అంటున్నాయ్. బలబలాలు చూస్తే రెండు జట్లు స్ట్రాంగ్ గా కన్పిస్తున్నాయ్.
ఐపీఎల్ టైటిల్‌కి మరో అడుగు దూరంలో ఉన్న రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్.. షేన్ వార్న్‌ను స్మరించుకుని చలించిపోయాడు. శాంసన్ మాట్లాడుతూ.. ' టోర్నమెంట్ ప్రారంభం నుంచి వార్న్ మా వెంటే ఉన్నాడని భావిస్తున్నాం. ఫస్ట్ రాయల్‌గా మా జట్టును అతను నడిపించిన విధానం మాకు ఎప్పటికీ స్పూర్తివంతమే. అతని కోసం టైటిల్ సాధించాలనే మరో అడుగు వేయాలని భావిస్తున్నాం.
బట్లర్ మాట్లాడుతూ.. 'రాజస్థాన్ రాయల్స్ టీం కోసం షేన్ వార్న్ చేసిన సేవ ఎనలేనిది. మొదటి సీజన్లోనే జట్టును విజయపథంలో నడిపించాడు. ఇక అతని మరణం మమ్మల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. మేము అతన్ని చాలా మిస్ అవుతున్నాం. కానీ ఆయన ఎక్కడున్నా.. ఈ రోజు మా టీం ప్రదర్శన చూసి గర్వపడుతాడని భావిస్తున్నాం.' అని బట్లర్ పేర్కొన్నాడు.
ఇక, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరడంలో జోస్ బట్లర్ కీలకపాత్ర పోషించాడు. అతను 16 మ్యాచ్‌లలో 4 సెంచరీలు మరియు 4 అర్ధసెంచరీలతో సహా 150.64 స్ట్రైక్ రేట్ మరియు 58.43 సగటుతో 818 పరుగులు చేశాడు. ఒకే సీజన్లో అత్యధికంగా 4 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బట్లర్ సమం చేశాడు. 2016 ఐపీఎల్లో కూడా విరాట్ 4 సెంచరీలు చేశాడు.
2008లో ఐపీఎల్ తొలి సీజన్ ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ సీజన్లో వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో చెన్నైని 163పరుగులకు కట్టడి చేసిన రాజస్థాన్.. తర్వాత ఛేజింగ్‌లో చివరి బంతికి థ్రిల్లింగ్ విజయం సాధించింది. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఇదే ఫీట్ రిపీట్ చేసి ఐపీఎల్ టైటిల్ కొట్టాలని భావిస్తోంది సంజూ సేన.