ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లోలో రాజస్థాన్‌పై గుజరాత్ (Gujarat Titans) గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓడిన రాజస్థాన్ (Rajasthan Royals)కు మరొక అవకాశం ఉంది. ఎలిమినేటర్ విజేతతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. లక్నో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (LSG vs RCB)ల మధ్య హై ఓల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది.
ఈసాలా కప్ నమదే.. అనే నినాదంతో బెంగళూరు అభిమానులు ప్రతి సీజన్‌కు రావడం.. ఆ తర్వాత బొక్క బొర్ల పడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత సీజన్లోనూ లీగ్ దశకే పరిమితమై ఇంటిముఖం పడుతుందని భావించినా ఆఖరికి ఢిల్లీపై ముంబై విజయంతో ఊపిరి పీల్చుకున్న బెంగళూరు ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. నాలుగో స్థానంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోతో చావో రేవో తేల్చుకోనుంది.
ఆరంభం నుంచి ఐపీఎల్లో కొనసాగుతూ ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లల్లో రాయల్ ఛాలెంజర్స్ ఒకటి. ఐపీఎల్ కప్ ఎగరేసుకెళ్లడానికి ఇప్పుడు మరో అవకాశం లభించిందా జట్టుకు. తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పుడు మరో అవకాశం లభించింది. ఛాంపియన్‌గా ఆవిర్భవించడానికి మూడు అడుగుల దూరం నిలిచింది.
ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్, రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేయగలిగితేనే- ఫైనల్స్‌లో అడుగు పెట్టగలుగుతుంది. వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్స్‌లో ఓడించగలిగితే- ఈ సాల కప్ నమ్దే అవుతుంది. దీనికోసం వరుసగా మూడు మ్యాచ్‌లను ఆర్సీబీ గెలవాల్సి ఉంటుంది మరి.