ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కథ ముగిసింది. ఈ సారి కూడా ఫ్యాన్స్ ఆశల్ని నట్టేట ముంచారు. రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆర్సీబీ పాలిట విలన్ లా మారిన బట్లర్ (Jos Buttler) (106పరుగులు 60బంతుల్లో 10ఫోర్లు 6సిక్సర్లు) ఒంటి చేత్తో మ్యాచ్ ఆర్సీబీ నుంచి లాగేసుకున్నాడు.
IPL 2022 సీజన్ విరాట్ కోహ్లీ దారుణ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సీజన్లో ఐపీఎల్లో 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 22.73 సగటుతో 115.98 స్ట్రైక్ రేట్‌తో 341 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. 73 పరుగులు అతని అత్యధిక స్కోరు. కోహ్లీ జట్టు విజయాల్లో కీ రోల్ ప్లే చేసినా ఇన్నింగ్స్ ఒకటి కూడా లేదు.
మరోవైపు ఫాఫ్ డుప్లెసిస్ ఈ సీజన్లో RCB తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్. కానీ, ఈ టోర్నమెంట్ పై సరియైన ప్రభావం చూపలేకపోయాడు. డుప్లెసిస్ 16 మ్యాచ్‌లలో 127.52 స్ట్రైక్ రేట్ మరియు 31.20 సగటుతో 468 పరుగులు చేశాడు. ఈ సీజన్లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే, కీలక మ్యాచుల్లో చెత్తాటతో ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు ఫాఫ్.
ఇక, గ్లెన్ మాక్స్వెల్ 13 మ్యాచ్‌లలో 27.36 సగటుతో మరియు 169.10 స్ట్రైక్ రేట్‌తో 301 పరుగులు చేశాడు. సీజన్ మొత్తంలో మ్యాక్స్‌వెల్ కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. మ్యాక్సీ ఈ సీజన్ లో ఒక పవర్ ఫుల్ ఇన్నింగ్స్ కూడా ఆడింది లేదు. క్వాలిఫయర్ -2 లో మంచి ఆరంభం లభిస్తే.. దాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలయ్యాడు.