ఇక, తనను అవమానించి, జట్టులోంచి వెళ్లగొట్టేలా చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) యాజమాన్యంపై డేవిడ్ వార్నర్ (David Warner) ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బ్రబౌర్న్ లో పరుగుల వరద పారించాడు. 58 బంతులాడిన వార్నర్ భాయ్.. 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇక, టీ20 క్రికెట్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా డేవిడ్ బాయ్ వరల్డ్ రికార్డున తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీతో ఓవరాల్ గా 89 అర్థ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ గేల్ 88 హాఫ్ సెంచరీల రికార్డును ఈ మ్యాచ్ ద్వారా అధిగమించాడు. ఇక, ఈ సీజన్ లో 50కి పైగా సగటుతో 8 మ్యాచుల్లో 356 పరుగులు సాధించాడు డేవిడ్ వార్నర్.
వార్నర్ బాబాయ్ ఈ మ్యాచులో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో, అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 400 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. మొత్తంగా టీ20 క్రికెట్ లో 401 సిక్సర్లు బాదాడు డేవిడ్ బాయ్. మొత్తానికి రైజర్స్ పై పంతం నెగ్గించుకున్న వార్నర్ బాబాయ్.. రికార్డుల పని పట్టాడని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.