ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మాత్రం ఏదో ఒక రూపంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను మాత్రం వెంటాడుతూనే ఉంది. కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి ఈసారి ఐపీఎల్ మొత్తాన్ని మహారాష్ట్ర (Maharashtra) వేదికగానే జరిపేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమైంది. అయినా కూడా ఐపీఎల్ 2022 సీజన్ ని కరోనా వెంటాడుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్‌కి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని వెంటనే ఐసోలేషన్‌కి తరలించింది టీమ్ మేనేజ్మెంట్.ప్యాట్రిక్ ఫార్హర్ట్ ఆరోగ్య పరిస్థితిని ఢిల్లీ క్యాపిటల్స్ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ప్యాట్రిక్‌ను కలిసిన, సన్నిహితంగా మెలిగిన ప్లేయర్లకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఎవ్వరికీ పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్.
అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సెగ చల్లారడంతో బయో బబుల్ లేకుండా మ్యాచులు నిర్వహించాలనే ప్రతిపాదనలు కూడా పెరుగుతున్నాయి.బయో బబుల్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య, కఠినమైన ఆంక్షల మధ్య ఆడడాన్ని ప్లేయర్లు ఇబ్బందిపడుతుండడం, మానసిక ఒత్తిడికి గురి అవుతుండడంతో బయో సెక్యూర్ జోన్‌ని తొలగించాలని డిమాండ్ పెరుగుతోంది.