ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మాత్రం ఏదో ఒక రూపంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను మాత్రం వెంటాడుతూనే ఉంది. కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి ఈసారి ఐపీఎల్ మొత్తాన్ని మహారాష్ట్ర (Maharashtra) వేదికగానే జరిపేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమైంది. అయినా కూడా ఐపీఎల్ 2022 సీజన్ ని కరోనా వెంటాడుతోంది. మరోసారి ఈ సీజన్ లో కరోనా కలకలం రేగింది.
ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ను కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా దెబ్బకి ఆ జట్టు వణికిపోతుంది. ఆదివారం డబుల్ ధమాకాలో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రాత్రి 7.30 గంటలకి డీవై పాటిల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో కరోనా కేసు నమోదైంది.
చెన్నైతో మ్యాచ్ కోసం ముంబైలోని ఓ హోటల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ బస చేయగా.. ఆ జట్టుతో ఉన్న నెట్ బౌలర్‌కి ఈరోజు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. అతనికి కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‌లోనూ కంగారు మొదలైంది. కరోనా పాజిటివ్‌గా తేలగానే అతడ్ని క్వారంటైన్‌కి తరలించి.. మిగిలిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి టెస్టులు చేస్తున్నారు.
టీమ్ ఫిజియో పాట్రిక్‌తో పాటు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, వికెట్ కీపర్ టిమ్ సైఫర్ట్తో పాటు మరో ముగ్గురు స్టాఫ్ మెంబర్స్‌కి కరోనా సోకింది. దీంతో, ఇప్పటికే వేదికల్ని రెండు సార్లు మార్చింది బీసీసీఐ. ఇప్పుడు ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో ఇంక ఎవరికైనా పాజిటివ్ అని తేలితే.. ఈ రోజు జరిగే మ్యాచ్ వాయిదా వేసే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.