యువ క్రికెటర్లలో దాగి ఉన్న సత్తాను బయటికి తీసుకురావడమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ముఖ్య ఉద్దేశం. సత్తా ఉన్న యువ క్రికెటర్ల కోసం కోట్లు కుమ్మరించడానికి కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వెనుకాడవు. అయితే ఐపీఎల్లో కూడా తెలుగు కుర్రాళ్లకు పెద్దగా గుర్తింపు దక్కడం లేదు. 2008 నుంచి ఇప్పటిదాకా జరిగిన సీజన్లలో ఒక్క అంబటిరాయుడు (Amati Rayudu), మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) తప్ప, మరో తెలుగు క్రికెటర్‌కి పెద్దగా అవకాశాలు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అవకాశాలు దక్కని లిస్ట్ లో మరో తెలుగు తేజం చేరాడు.
ఆర్సీబీ పుణ్యమాని ఐపీఎల్ 2021 సీజన్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీకర్ భరత్, 8 మ్యాచుల్లో 38.20 సగటుతో 191 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో దాదాపు 4 వేల పరుగులు చేసి, లిస్ట్ ఏ క్రికెట్లో 1281 పరుగులు చేసిన కోన శ్రీకర్ భరత్, భారత జట్టుకి రిజర్వు ప్లేయర్‌గా ఎంపికవుతున్నా... ఐపీఎల్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు.
అదిగో ఫస్ట్ మ్యాచ్.. ఇదిగో రెండో మ్యాచ్.. ఇప్పుడు మూడో గేమ్.. ఇలా ప్రతి దాంట్లో భరత్ కు అవకాశం దక్కుతుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, మనోడికి మాత్రం పూర్తిగా అన్యాయమే జరుగుతోంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో కెఎస్ భరత్‌ని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ సారథి రిషబ్ పంత్ ఉన్నంతవరకూ కేఎస్ భరత్ కు చోటు దక్కడం గగనంగా మారిందని చెప్పొచ్చు.
ఐపీఎల్ 2021 టోర్నీలో శ్రీకర్ భరత్ ఆటతీరు చూసిన రిషబ్ పంత్, తనకు పోటీ వస్తాడనే ఉద్దేశంతో అతన్ని కొనుగోలు చేసి రిజర్వు బెంచ్‌కి పరిమితం చేసి ఉంటాడని అంటున్నారు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్. అదీగాక, న్యూజిలాండ్ టెస్టు సందర్బంగా ఇప్పటికే తన కీపింగ్ స్కిల్స్ తో విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు. ఈ విషయాల్ని మనసులో పెట్టుకుని రిషబ్ ఇలా చేస్తున్నాడని తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ భావిస్తున్నారు.