IPL 2022 సీజన్ పెద్ద స్టార్లకు ఓ అగ్నీ పరీక్షలా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), RCB మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ సీజన్లో ఫామ్‌లో లేరు. విరాట్ ఇప్పటివరకు ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ ఏ ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టీ దాటలేకపోయాడు. రోహిత్ మరియు విరాట్ మాదిరిగానే, అంతర్జాతీయ క్రికెట్లోని మరో ఛాంపియన్ ప్లేయర్ ఈ సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
ఆ ప్లేయర్ ఎవరో కాదు.. సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson). తాజా సీజన్ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రూ.14 కోట్లకు అట్టిపెట్టుకుంది. డేవిడ్ వార్నర్‌ను పక్కనపెట్టి విలియమ్సన్‌ను కొనసాగించాలని సన్‌రైజర్స్ నిర్ణయించింది. వార్నర్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 4 అర్ధసెంచరీలు చేశాడు. కానీ.. విలియమ్సన్ మాత్రం చేతులేత్తేస్తున్నాడు.
2, 16, 32, 57, 17, 3, 16, 5, 47, 4.. ఈ సీజన్ లో ప్రారంభం నుంచి కేన్ మామ చేసిన స్కోర్లివి.. మొత్తం 10 మ్యాచుల్లో 199 పరుగులు. అందులో ఒక్కటే హాఫ్ సెంచరీ ఉంది. రోహిత్, కోహ్లీ ఫెయిలవుతున్నా.. వారి స్ట్రైక్ రేట్ 100కు పైనే ఉంది. కానీ.. కేన్ మామ స్ట్రైక్ రేట్ 100 లోపు ఉండటం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది.
ప్రస్తుత ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న టాప్ -4 క్రికెటర్లలో ఒకడు. విరాట్ కోహ్లీ (Virat Kohli), స్టీవ్ స్మిత్ (Steve Smith), జో రూట్ (Joe Root) లతో పోటీ పడుతూ.. ఆధునిక క్రికెట్ లో టాప్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా తన కళాత్మక బ్యాటింగ్ తో ఆకట్టుకుంటాడు కేన్ మామ. ఇక, సారథిగా కూడా న్యూజిలాండ్ కు అద్భుత విజయాలు అందించాడు. కానీ.. ఐపీఎల్లో ఫెయిల్ అవుతుండటం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.