ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest Updates) సెకండాఫ్ హోరాహోరీగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ రేస్ కోసం SRH మినహా మిగతా జట్లు ప్రయత్నిస్తుండటంతో .. ఫ్యాన్స్ కు కావాల్సినంత మజా వస్తోంది. ప్రస్తుతానికి ప్లేఆఫ్స్ చేరిన తొలి టీమ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలవగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రేసు నుంచి ఎప్పుడో తప్పుకుంది. దీంతో మిగిలిన ఆరు టీమ్స్ మధ్య మూడు బెర్తుల కోసం హోరాహోరీ పోటీ నెలకొంది. ఆ టీమ్స్ పరిస్థితి ఏంటో ఓ లుక్కేద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్ : గతేడాది లీగ్ దశలోనే నిష్కమ్రించిన చెన్నై సూపర్‌కింగ్స్.. ఈసారి దుమ్మురేపుతోంది. నిలిచింది. ధోనీ సేన 11 మ్యాచ్‌లలో 9 గెలిచి, రెండింట్లో ఓడింది. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ టీమ్ ఇంకా శనివారం రాజస్థాన్‌తో, సోమవారం ఢిల్లీతో, గురువారం పంజాబ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ : గతేడాది రన్నరప్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తోంది. 11 మ్యాచ్‌లలో 8 విజయాలు, మూడు పరాజయాలతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి అడుగు దూరంలో ఉంది. శనివారం ముంబైతో జరగబోయే మ్యాచ్‌లో గెలిస్తే ఈ టీమ్ ప్లేఆఫ్స్ చేరుతుంది. ఆ తర్వాత సోమవారం చెన్నైతో, శుక్రవారం బెంగళూరుతో ఆడాల్సి ఉంది. ఈ మూడింట్లో కనీసం ఒక్కటి గెలిచినా ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ కొట్టని విరాట్ కోహ్లి సేన ఈ సారి బెటర్ స్థానంలో ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్‌లలో 7 విజయాలు, 4 పరాజయాలతో మూడో స్థానంలో ఉంది. 14 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆదివారం పంజాబ్‌తో, బుధవారం హైదరాబాద్‌తో, శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది కోహ్లి సేన. రెండు గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లేఆఫ్ వెళ్లొచ్చు. ఒక్కటి గెలిచినా వాళ్లకు అవకాశం ఉంటుంది. అయితే అది ముంబై, కోల్‌కతా రెండూ 16 పాయింట్లకు చేరుకుంటే.. అప్పుడు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న టీమ్ ప్లేఆఫ్స్ వెళ్తుంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ : ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లు సాధించిన కోల్‌కతా నాలుగోస్థానంలో ఉంది. శుక్రవారం పంజాబ్‌తో, ఆదివారం హైదరాబాద్‌తో, గురువారం రాజస్థాన్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. ముంబై కూడా 10 పాయింట్లతో పోటీలో ఉన్నా.. మెరుగైన రన్‌రేట్‌తో కోల్‌కతా నాలుగోస్థానంలో ఉంది. శుక్రవారం పంజాబ్‌పై గెలిస్తే కోల్‌కతా చాన్స్ మెరుగవడంతోపాటు పంజాబ్ కింగ్స్ ఆశలు గల్లంతవుతాయి. అటు ముంబై తాను ఆడాల్సిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిస్తే.. కోల్‌కతా కూడా మూడింట్లోనూ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. రెండు గెలిచినా క్వాలిఫై కావాలంటే.. ముంబై, రాజస్థాన్, పంజాబ్ టీమ్స్ ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది.
ముంబై ఇండియన్స్ : ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పేలవంగా ఆడుతోంది. 11 మ్యాచ్‌లలో 5 విజయాలు, 6 పరాజయాలతో ఐదోస్థానంలో ఉంది. శనివారం ఢిల్లీతో, మంగళవారం రాజస్థాన్‌తో, శుక్రవారం హైదరాబాద్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. కోల్‌కతాతో పోలిస్తే నెట్ రన్‌రేట్ కూడా ముంబైది తక్కువగా ఉంది. ఒకవేళ కోల్‌కతా తాను ఆడబోయే మూడింట్లోనూ గెలిస్తే.. ముంబై కూడా మంచి రన్ రేట్ తో మూడింట్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఈ రెండు టీమ్స్ తమ మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి, ఆర్సీబీ అన్నింట్లోనూ ఓడితే.. ఇవి రెండూ ప్లేఆఫ్స్ వెళ్తాయి. అయితే ముంబై మూడింట్లో రెండు మాత్రమే గెలవగలిగితే.. వాళ్ల అవకాశాలు దెబ్బతింటాయి.
పంజాబ్ కింగ్స్ : పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో 4 విజయాలు, 7 పరాజయాలతో ఆరోస్థానంలో ఉంది. శుక్రవారం కోల్‌కతాతో, ఆదివారం బెంగళూరుతో, గురువారం చెన్నైతో ఆడాల్సి ఉంది. అయితే పంజాబ్ ఈ మూడు మ్యాచ్‌లలోనూ గెలిచినా నేరుగా క్వాలిఫై అవుతుందని చెప్పలేం. పంజాబ్ తన మూడు మ్యాచ్‌లూ గెలిచి, అటు కోల్‌కతా లేదా ముంబైలలో ఒక టీమ్ ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లలో ఓడితేనే రాహుల్ టీమ్‌కు ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి.
రాజస్థాన్ రాయల్స్ : రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్‌లలో 4 విజయాలు, 7 పరాజయాలతో ఏడో స్థానంలో ఉంది. శనివారం చెన్నైతో, మంగళవారం ముంబైతో, గురువారం కోల్‌కతాతో మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ టీమ్ కచ్చితంగా అన్ని మ్యాచ్‌లలో గెలవాలి. అంతేకాకుండా ముంబై, కోల్‌కతా, పంజాబ్‌లు ఎలా ఆడతాయో కూడా చూడాలి. ముంబై, కోల్‌కతాపై మ్యాచ్‌లు రాజస్థాన్ కచ్చితంగా గెలవాలి. రాజస్థాన్‌కు ప్లేఆఫ్స్ బెర్త్ మిణుకుమిణుకుమంటూ కనిపిస్తోందే తప్ప.. ఆ టీమ్ క్వాలిఫై కావడం అంత సులువైతే కాదు.