ఐపీఎల్ 2021 సీజన్ (IPL 2021) లో ఓటమితో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad). నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి వరకూ పోరాడిన ఓటమి తప్పలేదు. ఆరెంజ్ ఆర్మీ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. గెలిచే ఛాన్స్ ఉన్నా.. బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకుంది వార్నర్ సేన.
సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో జానీ బెయిర్‌స్టో (55; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీష్ పాండే (61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. నిజం చెప్పాలంటే.. ఇన్నింగ్స్ చివర్లో మనీశ్ ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతోనే ఆరెంజ్ ఆర్మీ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది.
హాఫ్ సెంచరీ చేసిన మనీశ్ పాండే.. ఇన్నింగ్స్ చివరలో వేగంగా ఆడలేకపోయాడు. జానీ బెయిర్‌స్టో ఔటయ్యే సమయానికి సన్‌రైజర్స్ 42 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో విజయ్ శంకర్ (11: 7 బంతుల్లో), అబ్దుల్ సమద్ (19 నాటౌట్: 8 బంతుల్లో) ధాటిగా ఆడారు. కానీ మనీశ్ మాత్రం ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యాడు. 14వ ఓవర్లో ఒక సిక్స్ బాదిన మనీశ్.. ఆ తర్వాత చివరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఒక్క బౌండరీ బాదలేకపోయాడు.
వీరేందర్ సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... "మనీశ్ పాండే ఇన్నింగ్స్ చివరి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఓ సిక్స్ కొట్టాడు. అప్పటికే మ్యాచ్ హైదరాబాద్ చేజారిపోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన మనీశ్.. చివర్లో బాధ్యత తీసుకుని బౌండరీలు కొట్టి ఉండాల్సింది. ప్రస్తుతం జట్టులో ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నాడు. క్రీజులో కుదురుకున్నాడు, ఒత్తిడిలో ఆడిన అనుభవం కూడా ఉంది. అంత అనుభవం ఉండి ఏం లాభం. ఒకవేళ మనీశ్ హిట్టింగ్ చేసుంటే.. మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 10 పరుగుల తేడాతో ఓడిపోయేది కాదు" అని అన్నాడు.