ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest Updates) సెకండాఫ్ హోరాహోరీగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ రేస్ కోసం SRH మినహా మిగతా జట్లు ప్రయత్నిస్తుండటంతో .. ఫ్యాన్స్ కు కావాల్సినంత మజా వస్తోంది. ప్రస్తుతానికి ప్లేఆఫ్స్ చేరిన తొలి టీమ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలవగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రేసు నుంచి ఎప్పుడో తప్పుకుంది. దీంతో మిగిలిన ఆరు టీమ్స్ మధ్య మూడు బెర్తుల కోసం హోరాహోరీ పోటీ నెలకొంది.
ఇక, గతేడాది లీగ్ దశలోనే నిష్కమ్రించిన చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Super Kings).. ఈసారి దుమ్మురేపుతోంది. నిలిచింది. ధోనీ సేన 11 మ్యాచ్‌లలో 9 గెలిచి, రెండింట్లో ఓడింది. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ టీమ్ ఇంకా శనివారం రాజస్థాన్‌తో, సోమవారం ఢిల్లీతో, గురువారం పంజాబ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఒకప్పటి సీఎస్కే ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్ ధోనీ అత్యంత విలువైన ఆటగాడన్నాడు. వయసు పై బడుతుంటడంతో ధోనీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నా.. జట్టులో కెప్టెన్‌గా ఎంతో కీలకంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కే ఎంఎస్ ధోనీ ఆడుతున్నాడు. మొదటి సీజన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ భుజాన వేసుకున్నాడు. వయసుపైబడిన ఆటగాళ్ల నుంచి కూడా మహీ అత్యుత్తమ ఆటను రాబడుతున్నాడు. డ్వేన్ బ్రావో, ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి ప్లేయర్లే ఇదుకు చక్కని ఉదాహరణ.
లేటెస్ట్ గా స్టార్ స్పోర్ట్స్ సూపర్ కింగ్స్ షోలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ... " ఇప్పటివరకు ఐపీఎల్లో ధోనీ బ్యాట్ తో రాణించనప్పటికీ.. అతడే అత్యంత విలువైన ఆటగాడు. జట్టుకు ఓ నాయకుడిగా వ్యవహరిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. అతని వయసు పైబడుతోంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ వీటన్నింటికి చెక్ పెడుతూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. డ్వాన్ బ్రావో లాంటి ఆటగాళ్లు టోర్నమెంట్‌పై ప్రభావం చూపుతున్నారు. చెన్నై జట్టు ప్రతి విభాగంలో బాగా రాణిస్తోంది" అని అన్నాడు.