IPL 2019: రాయల్ ఛాలెంజర్స్‌ ఈ గతికి కారణమేంటి... విరాట్ సేనకు ఏమైంది...

సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ వరల్డ్ నెం.1 బ్యాట్స్‌మెన్‌గా ఉన్న ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ ఒకవైపు... ఎటువంటి బౌలర్ అయినా చుక్కలు చూపించే భయంకర బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్ మరోవైపు... అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క విజయం సాధించడానికి ముప్పుతిప్పలు పడుతోంది. ఇంతవరకూ ఈ సీజన్‌లో ఒక్క గెలుపు కూడా లేని రాజస్థాన్ రాయల్స్ కూడా బెంగళూరును ఓడించిందంటే... విరాట్ కోహ్లీ టీమ్ ఆటతీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన టీమ్స్‌ చిత్తుగా ఓడినా టీమిండియాపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు... కానీ కెప్టెన్ కోహ్లీ నడిపించే బెంగళూరు జట్టు పరాభవం... అది కూడా వన్డే వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఐపీఎల్‌లో! భారత జట్టుపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందోనని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఈరోజు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో విరాట్ సేనకు విక్టరీ రాకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుందోనని అభిమానులు భయపడుతున్నారు.