న్యూజిలాండ్ (New Zealand)తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇండియా (India).. ప్రస్తుతం టీ20 సిరీస్‌ను సమం చేసింది. మొదటి టీ20లో ఓడిపోయిన భారత్ రెండో టీ20లో అద్భుత విజయం అందుకుంది. ఆదివారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో T20I జరిగిన విషయం తెలిసిందే.
* లక్నోలో మొదటి సారి గెలిచిన ఛేజింగ్ టీమ్ : కివీస్, ఇండియా రెండో టీ20కి ముందు లక్నోలో ఐదు T20Iలు జరిగాయి. అన్ని మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం అందుకుంది. అయితే ఆదివారం తొలిసారి లక్నోలో ఛేజింగ్ చేసిన టీమ్ ఇండియా గెలుపు సొంతం చేసుకుంది. లక్నోలో లక్ష్యాన్ని అందుకున్న మొదటి టీమ్‌గా నిలిచింది. కానీ భారత్ ఛేజింగ్ అంత సులువుగా సాగలేదు. లక్ష్యం చిన్నదే అయినా చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
* తన రికార్డును తానే బ్రేక్ చేసిన ఇషాన్ : లక్నో టీ20లో ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 19 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ కేవలం 59.37 మాత్రమే. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 30 బంతులు ఆడి తక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేసిన భారత ఓపెనర్‌గా కిషన్ చెత్త రికార్డు సృష్టించాడు. అంతకుముందు గతేడాది ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై 83.33 స్ట్రైక్ రేట్‌తో 42 బంతుల్లో 35 పరుగులు చేశాడు. లక్నోలో కిషన్ తన రికార్డును తానే బ్రేక్ చేశాడు.
* సిక్సులు కొట్టడం మర్చిపోయారు : భారతదేశం మొట్టమొదటి T20I మ్యాచ్‌కి 2007లో ఆతిథ్యం ఇచ్చింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఒక్క ప్లేయర్ కూడా సిక్స్ బాదలేకపోయారు. భారీ హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ కూడా బాల్‌ను బౌండరీ దాటించలేకపోయారు.
* సిక్స్ కొట్టకుండా అత్యధిక బాల్స్ : భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో మొత్తం 239 బాల్స్ బౌల్ చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో 120, రెండో ఇన్నింగ్స్‌లో 119 బాల్స్ వేశారు. కానీ ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. దీంతో అధిక ఎక్కువ బాల్స్ ఆడి సిక్స్ నమోదు కాని మ్యాచ్‌గా రికార్డు సొంతం చేసుకుంది. ఈ రికార్డు ఇంతకుముందు 2021లో మీర్పూర్లో జరిగిన బంగ్లా, కివీస్ మ్యాచ్ పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో 239 బంతులు ఆడినా ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు.