ఇంగ్లండ్ పర్యటనలో రెండో టెస్ట్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఫస్ట్ టెస్ట్ లో గెలిచి.. విజయంతో సిరీస్ ను ప్రారంభించాలనుకున్న టీమిండియాకు ఆశలకు వరుణుడు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే.మొదటి టెస్ట్ చివరి రోజు వర్షంతో తుడిచిపెట్టుకపోయింది. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ విజయం దాదాపు ఖాయం అయినా.. ఆ క్రెడిట్ వరణుడి ఖాతాలోకి వెళ్లింది.
అయితే రోహిత్ భారీ స్కోర్ బాకీ ఉన్నాడు. కోహ్లీ గోల్డెన్ డక్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చతేశ్వర్ పుజారా తన వైఫల్యాన్ని కొనసాగిస్తుండగా.. అజింక్య రహానే తడబడుతున్నాడు. రిషభ్ పంత్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. వీరు ఫామ్ అందుకుంటే భారత బ్యాటింగ్ విభాగం బలోపేతం కానుంది.
ఇక, ఏకైక స్పిన్నర్‌గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన రవీంద్ర జడేజాకే మరోసారి అవకాశం దక్కనుంది. ఫస్ట్ టెస్ట్‌లో జడేజా బౌలర్‌గా రాణించకపోయినా.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. దీంతో, స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కనుంది.
ఈ నలుగురు ఫస్ట్ టెస్ట్‌లో దుమ్ములేపారు. అయితే శార్దూల్ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడట. రెండో టెస్ట్ కోసం మంగళవారం సాధన చేసేటప్పుడు అతడి కండరాలు పట్టేశాయి. శార్దూల్ గాయం తీవ్రతపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారమైతే లేదు. ఆడలేని పరిస్థితిలో ఉంటే మాత్రం సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రెండో టెస్ట్ ఆడనున్నాడు.
ఇక, తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో ఆల్‌రౌండర్ జాబితాలో మొయిన్ అలీని తిరిగి జాతీయ జట్టుకు పిలిపించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లంతా ఇలాగే సరైన ప్రదర్శన చేయకపోతే కచ్చితంగా జట్టులో మార్పు ఉంటుందని కోచ్ సిల్వర్‌వుడ్ ఇదివరకే స్పష్టం చేశాడు.