ఈ నెల 26 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో సౌతాఫ్రికాతో భారత్ 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఆడనుంది. ఇక సౌతాఫ్రికాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీమిండియా కఠిన బయో బబుల్ ఆంక్షల మధ్య ఈ సిరీస్‌లు ఆడనుంది. ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలిచింది లేదు. ఈ సారి ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది.
భారత వన్డే సారథిగా, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్‌గా ఇటీవల డబుల్ ప్రమోషన్ అందుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా పర్యటన కోసం మూడు రోజుల క్రితమే ప్రాక్టీస్ షురూ చేశాడు. సఫారీ గడ్డపై సవాల్ విసిరే బౌన్సీ పిచ్‌లపై రాణించడంపై ప్రత్యేక దృష్టి సారించాడు. టీమిండియా త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర అలియాస్ రఘుతో ఎక్కువ బౌన్స్ అవుతున్న త్రో డౌన్స్ ప్రాక్టీస్ చేశాడు. సౌతాఫ్రికా పేసర్లు రబడా, అన్రిచ్ నోర్జ్, ఎంగిడిని ఫేస్ చేసేందుకు రఘుతో త్రో డౌన్స్ వేయించుకున్నాడు.
మరోవైపు టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వేటుకు గురైన అజింక్యా రహానే నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ఇటీవల ముంబై వేదికగా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాల గాయంతో జట్టులో చోటు కోల్పోయాడు. కెరీర్ పరంగా క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్న రహానేకు సౌతాఫ్రికా పర్యటన లిట్మస్ టెస్ట్లాంటింది. రాణిస్తే కెరీర్ కొనసాగుతుంది. లేదంటే ఎండ్ కార్డ్ పడినట్లే. దీంతో బ్యాటింగ్‌పై రహానే ప్రత్యేక ఫోకస్ పెట్టాడు.