సరియైన రిజల్ట్ చూపకపోతే విరాట్ కోహ్లీ (Virat Kohli) లాంటి ప్లేయర్ కైనా గడ్డు పరిస్ధితులు తప్పవు అని బీసీసీఐ (BCCI) రుజువు చేసింది. ఆటగాడిగా ఆకట్టుకుంటూ.. ప్రత్యర్థుల కవ్వింపులకు దీటుగా బదులిస్తూ.. కెప్టెన్గా నిలకడైన విజయాలు సాధిస్తూ.. ఇన్నాళ్లూ జట్టులో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన అతడు అనూహ్య పరిస్థితుల నడుమ ఇప్పుడు వన్డే కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు వన్డే సారథ్యం బాధ్యతలు అప్పగించింది. దీంతో, స్టార్ ఆటగాళ్లకు హెచ్చరికలు పంపింది బీసీసీఐ.
గత కొంతకాలంగా విఫలమవుతున్న అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాతో పాటు ఇషాంత్ శర్మకు ఈ సిరీస్ చివరి చాన్స్ అని చెప్పవచ్చు. ఈసారి గనుక వీళ్లు రాణించకపోతే.. వారి కెరీర్లకు ఎండ్ కార్డ్ పడినట్లే. పేలవ పామ్తోనే వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రహానే మెడపై కత్తి వేలాడుతుంది. కేవలం విదేశాల్లో మెరుగైన రికార్డు ఉందనే కారణంతోనే అతన్ని ఈ సిరీస్కు ఎంపిక చేశారు.
ఇక తుది జట్టులో చోటు కోసం రహానేతో పోటీపడుతున్నాడు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ అయిన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలో ఒక్కరే తుది జట్టులో ఆడే పరిస్థితి నెలకొంది. పుజారా సైతం ఈ సిరీస్లో రాణించాల్సిందే. అనుభవం దృష్ట్యా ఆరంభ మ్యాచ్ల్లో వీరికి చోటు దక్కనుంది. ఇక టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు సౌతాఫ్రికా పర్యటనే చివరిదనే సంకేతాలు వినిపిస్తున్నాయి.