శ్రీలంక (Sri Lanka)తో సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా (Team India) అదరగొట్టింది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి వన్డే సిరీస్ గెలుచుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకోవడం విశేషం. అయితే రెండో వన్డేలో విజయానికి టీమిండియా కాస్త శ్రమించాల్సి వచ్చింది.
బౌలర్లు మెరుగ్గా రాణించినా, బ్యాటర్లు తడబడ్డారు. మిడిలార్డర్లో వచ్చిన కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడుతూ టీమిండియాకు విజయాన్ని చేకూర్చాడు. 103 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు.
* ప్రత్యర్థిపై పంజా.. : వన్డేల్లో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ అవతరించింది. శ్రీలంకపై అత్యధికంగా 95 వన్డేల్లో గెలిచి తొలి స్థానంలో నిలిచింది. శ్రీలంక, భారత్ మధ్య ఇప్పటివరకు 164 వన్డేలు జరగ్గా 57 మ్యాచుల్లో శ్రీలంక పైచేయి సాధించింది. మరోవైపు, చిరకాల ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేల్లో కంగారూ జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. న్యూజిలాండ్‌పై 95 మ్యాచుల్లో గెలిచి టీమిండియాతో టాప్ రికార్డును ఆసీస్ జట్టు పంచుకుంటోంది.
* హార్దిక్ మరో రికార్డ్ : టీమిండియా టాప్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఘనతను సాధించాడు. ఆల్ టైం దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో తొలి 50 ఇన్నింగ్సుల్లో అత్యధిక స్ట్రైక్ రేటు కలిగిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 50 ఇన్నింగ్సుల వరకు 113.6 స్ట్రైక్ రేటుతో హార్దిక్ కపిల్ దేవ్(103.5)ను దాటేశాడు. ఈ విషయంలో టాప్ బ్యాట్స్‌మన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను దాటేశాడు.