విండీస్ సిరీస్ లో దుమ్మురేపిన టీమిండియా (Team India).. లంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు అదిరే ఆట తీరుతో చెలరేగారు. మొదట భారీ స్కోర్ సాధించిన టీమిండియా ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంకేయులు ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. దీంతో ఏకపక్షంగా సాగిన పోరులో శ్రీలంక (Sri Lanka)పై టీమిండియా 62 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ రెండు సిరీస్ ల్లో పది క్యాచులు పైగా ఫీల్డర్లు వదిలేశారు. ప్రస్తుత టీమిండియా వన్డే, టీ20 జట్లలో హయ్యస్ట్ ప్లేయర్లు ఈసారి ఐపీఎల్లో ఆడినవాళ్లే. రెండున్నర నెలల పాటు అత్యుత్తమ ఆటతీరు, ఫీల్డింగ్‌తో అదరగొట్టిన వాళ్లే. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ ఆటగాళ్ల ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కానీ, ఈ రెండు సిరీస్ ల్లో టీ20 టోర్నీలో చాలా క్యాచ్‌లు వదిలేశారు. ఫీల్డింగ్ వైఫల్యాలకు లెక్కేలేదు. లంకతో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచులో కూడా శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ వంటి కుర్రాళ్లు కూడా క్యాచులు వదిలేశారు. అలాగే, విండీస్ సిరీస్ లో అయితే, పూరన్, పావెల్ వంటి స్టార్ హిట్టర్ల క్యాచులు కూడా మన ఫీల్డర్లు వదిలేశారు. మ్యాచులు గెలిచారు కాబట్టి సరిపోయింది. లేకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది.
కొన్నిసార్లు అదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నా.. మొత్తంగా వన్డే, టీ20 సిరీస్‌లలో టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యాలు ఘోరమనే చెప్పాలి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యున్నత ప్రమాణాలు నిర్దేశించిన భారత జట్టు మునుపెన్నడూ లేనంత చెత్త ఫీల్డింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ తప్పిదాలు మెగా కప్ కు ముందు సరిదిద్దుకోవాలి. ఆ దిశగా ఆలోచించి లోపాల్ని సరిదిద్దుకోకపోతే భారీ మూల్యం తప్పదని క్రీడా పండితులు హెచ్చరిస్తున్నారు.