మొహాలీ వేదికగా వందో టెస్ట్ ఆడిన కోహ్లి(Virat Kohli) సెంచరీ సాధిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైన సంగతి తెలిసిందే. మైల్ స్టోన్ మ్యాచులో హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న.. విరాట్ కోహ్లీని లసిత్ ఎంబుల్దెనియా బోల్తా కొట్టించాడు. ఇక, సెకండ్ ఇన్నింగ్స్ ఆడక ముందే శ్రీలంక భారీ పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ(76 బంతుల్లో 45 పరుగులు) చేసి లసిత్ ఎంబుల్దెనియా బౌలింగ్‌లో కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో.. ఫ్యాన్స్ అంతా నిరాశకు గురయ్యారు.
33 ఏళ్ల విరాట్ కోహ్లి మార్చి 12 నుంచి శ్రీలంకతో (India vs Sri Lanka) రెండో టెస్ట్ మ్యాచ్‌లో 42 లేదా అంతకంటే తక్కువ స్కోరు చేస్తే, అతని టెస్ట్ సగటు దాదాపు 6 ఏళ్ల తర్వాత మొదటిసారిగా 50 కంటే తక్కువగా పడిపోతుంది. భారత్-శ్రీలంక జట్ల మధ్య 2 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రెండో డే-నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం టెస్టుల్లో విరాట్ సగటు 50.35గా ఉంది. టెస్టుల్లో విరాట్ సెంచరీ సాధించి 838 రోజులైంది.
తన కెరీర్ 52వ టెస్టులో విరాట్ వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌పై 50 సగటును సాధించాడు. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన పూణె టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ 254 పరుగుల ఇన్నింగ్స్ ఆడడం ద్వారా కెరీర్లో అత్యుత్తమ బ్యాటింగ్ సగటు 55.10 సాధించాడు. కానీ క్రమంగా విరాట్ యావరేజ్ తగ్గుతోంది. శ్రీలంకతో మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 45 పరుగుల వద్ద ఔటయ్యాడు.