టీమిండియా వికెట్ కీపర్ డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం టెస్టుల్లో దుమ్మురేపుతున్నాడు. ప్రత్యర్ధి ఎవరైనా, మైదానం ఏదైనా సరే నేను దిగనంత వరకే అన్నట్టు ధనాధన్ బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపుతున్నాడు. ఇక, స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ లో మనోడి దూకుడు పుల్ స్టాప్ పడటం లేదు.
ఇక, బెంగళూరు వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టు మ్యాచ్ (IND vs SL Pink Test)లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టి రికార్డు సాధించిన పంత్ ఈ క్రమంలో దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. ఇక, అదే మ్యాచ్‌లో పంత్ మరో రికార్డు కూడా సాధించాడు. ఈ సారి దిగ్గజ వికెట్ కీపర్లు మహేంద్రసింగ్ ధోని, ఆడమ్ గిల్ క్రిస్ట్‌ను సైతం రిషబ్ పంత్ అధిగమించాడు.
అలాగే టెస్టు క్రికెట్లో మొదటి 50 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వికెట్ కీపర్‌గా కూడా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ లిస్ట్ లో రిషబ్ పంత్ తర్వాతి స్థానాల్లో టీమిండియా దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని, ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, బ్రాడ్ హాడిన్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఉన్నారు. పంత్ తన మొదటి 50 ఇన్నింగ్స్‌ల్లో 42 సిక్సులు బాదాడు.
పంత్ తర్వాతి స్థానాల్లో ధోని 31 సిక్సర్లు, ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాడిన్ 31సిక్సర్లు, ఆడం గిల్‌క్రిస్ట్ 30 సిక్సర్లు, ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ 21 సిక్సులతో ఉన్నారు. మొత్తంగా 100 సిక్సులతో ఆడమ్ గిల్ క్రిస్ట్ మొదటి స్థానంలో ఉండగా.. 79 సిక్సులతో ధోని రెండో స్థానంలో, 54 సిక్సులతో బ్రాడ్ హాడిన్ మూడో స్థానంలో ఉన్నారు.