గతంతో పోలీస్తే సౌతాఫ్రికా టీమ్ చాలా బలహీనంగా ఉంది. దీంతో.. ఈ సారి టీమిండియా పని సులువు అవుతోందని అందరు భావించారు. కానీ.. చెత్త బ్యాటింగ్, పేలవ ఫీల్డింగ్‌తో విజయాన్ని చేజార్చుకుంది. పదే పదే ఆఫ్ సైడ్ బంతుల్ని వెంటాడీ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. బౌలర్లు మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఇక, ఫీల్డింగ్ లోనూ నిరాశపర్చింది కోహ్లీసేన.
ఈ పర్యటనకు ముందే ఈ మూడు టెస్ట్‌ల సిరీస్ కోహ్లీ కెరీర్‌కు చాలా కీలకమైనదని క్రికెట్ ఎక్స్పెర్ట్స్ కామెంట్ చేశారు. ఈ ఓటమికి తోడు మైదానంలో అతను ప్రవర్తించిన తీరు మరింత ఎఫెక్ట్ చేయనుంది. థర్డ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్ ఎల్బీ విషయంలో డీఆర్ఎస్ తప్పిదం ఉన్నప్పటికీ.. దానిపై కోహ్లీ చేసిన రచ్చపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టెక్నాలజీలో తప్పొప్పులు సహజమే. కానీ, కోపం ఆపుకోలేని కెప్టెన్ కోహ్లీ స్టంప్ మైక్ దగ్గరికొచ్చి మరీ బ్రాడ్‌కాస్టర్‌ను తిట్టడం చూస్తే తను చాలా ప్రెజర్లో ఉన్నాడని అర్థమైంది. కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్ సైతం కెప్టెన్ రూట్లోనే నడిచారు. ప్రపంచం మొత్తం తమ జట్టుకు వ్యతిరేకంగా ఉందని రాహుల్ కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఫోర్త్డే మార్నింగ్ డుసెన్, పీటర్సన్‌ను మనోళ్లు స్లెడ్జ్ చేశారు.
ఏది ఏమైనా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా ప్రవర్తించి ఉండాల్సింది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. కెప్టెన్ కోహ్లీనే ఇలా చేస్తే.. యువ ఆటగాళ్లు ఎలా అర్థం చేసుకుంటారని, వారికి ఇచ్చే మెసేజ్ ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.