29 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడపై చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియా (Team India)కు సెకండ్ టెస్టులో పరాభవమే ఎదురైంది. కానీ, మూడో టెస్ట్ రూపంలో మరో ఛాన్స్ కోహ్లీసేన ముందుంది. ఇప్పటికే.. మూడు టెస్టుల సిరీస్ లో 1-1 తో రెండు జట్లు సమంగా నిలిచాయ్. ఫస్ట్ టెస్ట్ టీమిండియా నెగ్గితే.. రెండో మ్యాచ్ లో సఫారీ టీమ్ అదరగొట్టింది.
దక్షిణాఫ్రికా పర్యటన (India Vs South Africa)లో ఉన్న టీమిండియా.. ఈ నెల 11 నుంచి సిరీస్ విజేతను నిర్ణయించే కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో మూడో టెస్టు ఆడనుంది. సిరీస్ గెలుపే లక్ష్యంగా సౌతాఫ్రికాలో టీమిండియా అడుగుపెట్టడంతో మ్యాచ్ జరగనున్న కేప్‌టౌన్ వేదికలో మన రికార్డుల గురించి చర్చ మొదలైంది.
1992లో తొలి సారి సౌతాఫ్రికాతో టీమిండియా కేప్‌టౌన్‌లో తలపడింది. జనవరి 2 నుంచి 6 మధ్య జరిగిన ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్‌లో అది నాల్గో మ్యాచ్. ఆ తర్వాత 1996లో మళ్లీ కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో భారత్ తలపడింది. ఆ మ్యాచ్ కూడా జనవరి 2 నుంచి 6 మధ్య జరిగింది. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 282 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అది సిరీస్‌లో రెండవ మ్యాచ్.
ఇక ఇరు జట్లు నాలుగో సారి 2010లో కేప్‌టౌన్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ కూడా జనవరి 2 నుంచి 6 మధ్యనే జరిగింది. ఇలా కేప్‌టౌన్ వేదికగా భారత్ ఆడిన తొలి నాలుగు టెస్టు మ్యాచ్‌లు జనవరి 2 నుంచి 6 మధ్యనే జరగడం విశేషం. అయితే ఆ మ్యాచ్‌ను టీమిండియా డ్రాగా ముగించింది. సిరీస్‌లో అది మూడో మ్యాచ్.
అయితే, ఇప్పుడు జరగబోయే మూడో టెస్టు మ్యాచ్ కూడా జనవరిలోనే జరగనుంది. దీంతో ఇప్పటివరకు కేప్‌టౌన్ వేదికగా భారత్ ఆడిన టెస్టు మ్యాచ్‌లన్నీ జనవరిలోనే జరగడం విశేషం. అయితే ఇప్పటివరకు కేప్‌టౌన్‌లో విజయం సాధించని భారత్ ఈ సిరీస్ నెగ్గాలంటే మాత్రం గత రికార్డులను పక్కన పెట్టి గెలిచి చరిత్ర తిరగ రాయాల్సిందే. ఇక, ఈ టెస్ట్ కోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ సెషన్ ను కూడా మొదలుపెట్టారు.