మళ్లీ అదే ఫలితం రిపీట్ అయింది. తొలి టి20లో ఎదురైన పరాభవాన్నే మరోసారి రుచి చూడాల్సి వచ్చింది టీమిండియా (Team India). మైదానం మారిందే కానీ.. భారత ఆట తీరు మాత్రం మారలేదు. టి20ల్లో 13 వరుస విజయాల తర్వాత తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) నాయకత్వంలో టీమిండియాకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. కటక్ లోని బారాబతి స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో టి20లో పర్యాటక దక్షిణాఫ్రికా (South Africa) జట్టు 4 వికెట్లతో ఘనవిజయం సాధించింది.
149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. భువనేశ్వర్ కుమార్ దెబ్బకు ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినా.. హెన్రిచ్ క్లాసెన్ (46 బంతుల్లో 81 ; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్ తో సౌతాఫ్రికాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫలితంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ లో సౌతాఫ్రికా జట్టు 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక, ఈ సిరీస్ ద్వారా బీసీసీఐ ఎంతో మంది కుర్రాళ్లను పరీక్షించాలనుకుంది.
ఈ ఫామ్ కారణంగానే రుతురాజ్ టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి.. ఈ కుర్రాడు టీమిండియా తరపున 5 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కానీ, రుతురాజ్ ఒక్క మ్యాచులో కూడా 25 పరుగులు చేయలేదు. ఈ ప్రదర్శనతో టీమిండియాకు భారంగా మారాడు రుతురాజ్. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో కూడా అట్టర్ ప్లాప్ అవుతున్నాడు రుతురాజ్.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రుతురాజ్ 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. 25 ఏళ్ల గైక్వాడ్ తొలి టీ20లోనూ రాణించలేకపోయాడు. 15 బంతుల్లో 23 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతకుముందు, టీమిండియా తరుపున 3 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఆ మూడు మ్యాచుల్లో 21, 14 మరియు 4 పరుగుల మాత్రమే చేసి నిరాశపర్చాడు.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు ఇషాన్ కిషన్ తొలి టీ20లో హాఫ్ సెంచరీ, రెండో టీ20లో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ IPL 2022లో బాగా రాణించినప్పటికీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వీరిద్దరూ రుతురాజ్ కు తీవ్ర పోటీ ఇచ్చే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, కోహ్లీ తిరిగి జట్టులో చేరినప్పుడు లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.
అయితే.. ఓవరాల్ గా టీ20 క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్‌కు మంచి రికార్డు ఉంది. అతను ఈ మ్యాచ్‌కు ముందు 78 మ్యాచ్‌లలో 35 సగటుతో 2,465 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ మరియు 19 అర్ధసెంచరీలు ఉన్నాయి. అంటే అతను 50 లేదా అంతకంటే ఎక్కువ 20 సార్లు స్కోర్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 133. కానీ, అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం నిరాశపరుస్తునే ఉన్నాడు.