సఫారీ దెబ్బకి సొంతగడ్డపై కూడా టీమిండియా నిలవలేకపోతుంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సఫారీ చేతిలో భారత్‌కు చుక్కెదురైంది. సిరీస్‌కు ముందు వరుసగా 12 టీ20 మ్యాచ్‌ల్ని గెలిచిన భారత్.. ఇప్పుడు ఒక మ్యాచ్ గెలవడమే కష్టంలా మారింది. చివరి నిమిషంలో స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) గాయంతో తప్పుకోవడంతో దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగే సిరీస్ కు టీమిండియా (Team India) కెప్టెన్ గా రిషభ్ పంత్ (Rishabh Pant) ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.
భవిష్యత్తు టీమిండియా కెప్టెన్ అంటూ పలువురు క్రికెటర్లు పంత్ ను ఆకాశానికి ఎత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను తాను కెప్టెన్ గా నిరూపించుకోవడానికి పంత్ కు దక్షిణాఫ్రికా సిరీస్ రూపంలో ఒక చక్కటి అవకాశం వచ్చింది. వికెట్ కీపర్ అయిన పంత్ కెప్టెన్ అవ్వడంతో ధోని (MS Dhoni) వారసుడు వచ్చాడంటూ పలువురు క్రీడా నిపుణులు కామెంట్లు చేశారు.
రెండో టీ20లోనూ పవర్ ప్లేలోనే బంతినిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు క్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు క్రీజులో ఉన్న ఏ కెప్టెన్ అయినా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ పంత్ మాత్రం నిర్లక్ష్యపు షాట్‌తో వెనుదిరిగాడు.రిషభ్ పంత్ ఫీల్డింగ్ సెట్ కూడా తన ఆలోచన మేరకు జరుగుతుందా అనేది డౌటే.
ఐపీఎల్లో కెప్టెన్సీ సేవలందించిన ప్లేయర్లు తమ అనుభవాన్ని ఇండియా జట్టులో చూపించాలని బాగా తహతహలాడుతున్నట్లు కన్పిస్తుంది. ఫీల్డింగ్ సెట్ విధానంలో మిగతా వాళ్ల ప్రమేయం ఫీల్డ్‌లో ఎక్కువైనట్లు కన్పిస్తోంది. ఇక వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అజమాయిషీ కాస్త ఎక్కువ ఉన్నట్లు కన్పిస్తోంది. దీంతో.. డమ్మీ కెప్టెన్ గా పంత్ మారాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
టెస్ట్ క్రికెట్ లో పంత్.. ఓ డేంజరస్ బ్యాటర్. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే, లిమిటెట్ క్రికెట్ లో పంత్ నుంచి ఇంతవరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. మ్యాచ్ ని ఒంటి చేత్తో గెలిపించిన సందర్భమూ లేదు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు బెంచ్ కే పరిమితమవుతున్నారు. దినేశ్ కార్తీక్ కుర్రాళ్లతో పోటీపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కెప్టెన్ సంగతి పక్కన పెడితే.. పంత్ కి జట్టులో చోటే కష్టమంటున్నారు క్రీడా పండితులు.