అర్ష్ దీప్ సింగ్ : ప్రస్తుతం టీ20 క్రికెట్లో ఎక్కువగా విన్పిస్తున్న పేరు అర్ష్‌దీప్ సింగ్. టీ20లో గత కొన్ని నెలలుగా ఈ ఎడమచేతి వాటం బౌలర్ అద్బుత ప్రదర్శన చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసింది కూడా ఈ యంగ్ బౌలరే. దీంతో.. అర్ష్‌దీప్‌కి వన్డే క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశాన్ని ధావన్ ఇచ్చాడు. కానీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ముందు అర్ష్‌దీప్ ప్రభావం చూపలేకపోయాడు. 8.1 ఓవర్లలో అత్యధికంగా 68 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.
యుజ్వేంద్ర చాహల్ : ఈ పర్యటనలో యుజ్వేంద్ర చాహల్ భారతదేశానికి అత్యంత అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌గా కన్పించాడు. కానీ ఆక్లాండ్ వన్డేలో చాహల్ 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అతని బౌలింగ్ గణాంకాలు... 10-0-67-0. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి.. ఒత్తిడి పెంచాల్సింది పోయి.. కీలక సమయంలో పరుగులు సమర్పించుకున్నాడు.
శార్దూల్ ఠాకూర్ : ఈ బౌలింగ్ ఆల్ రౌండర్ కూడా ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున చాలా క్రికెట్ ఆడాడు. పవర్ ప్లే ఓవర్లలో శార్దూల్ చాలా నియంత్రణతో బౌలింగ్ వేశాడు. కానీ కీలక సమయంలో అతని ఒక ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. శార్దూల్ తన ఎనిమిదో ఓవర్లో ఏకంగా 25 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్ తో మ్యాచ్ భారత్ చేతి నుంచి జారిపోయింది. శార్దూల్ చివరి రెండు ఓవర్లలో ఏకంగా 38 పరుగులు పిండుకున్నారు కివీస్ బ్యాటర్లు.
ఇక.. ఆదివారం ఉదయం ఇరు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ నిలవాలని టీమిండియా భావిస్తుంది. బ్యాటింగ్ లో ఎటువంటి సమస్యలు లేకపోయినా.. బౌలింగ్ లో మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తుంది. కీలకమైన రెండో వన్డేలో కూడా టీమిండియా బౌలర్లు ఇవే తప్పులు రిపీట్ చేస్తే మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.