టీమిండియా - కివీస్ ల (Ind Vs Nz) మధ్య ఉత్కంఠగా జరిగిన తొలి టెస్ట్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఆఖరి బంతి వరకు భారత్‌ను ఊరించిన విజయం తృటిలో చేజారింది. ఈ మ్యాచ్‌లో చివరి క్షణం వరకు పోరాడిన భారత్.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. ఆజాజ్ పటేల్(23 బంతుల్లో 2 నాటౌట్), రాచిన్ రవీంద్ర(91 బంతుల్లో 18 నాటౌట్) అడ్డుగోడలా నిలబడటంతో భారత విజయం చేజారింది.
4/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ ఆఖరి రోజు ఆట ముగిసేసమయానికి 98 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిని తప్పించుకుంది. బ్యాడ్ లైట్ కారణంగా మరో 8 నిమిషాల ముందే అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేసారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు.