హార్దిక్ పాండ్యా విషయంలో లేథమ్ వ్యవహరించిన తీరుకు కౌంటర్ గానే ఇషాన్ కిషన్ ఆ పని చేశాడని అభిమానులు అనుకున్నారు. అయితే మ్యాచ్ కు కామెంటేటర్లుగా ఉన్న సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు మాత్రం ఇషాన్ కిషన్‌పై మండిపడ్డారు. ఈ ఘటన సమయంలో కామెంట్రీ చెబుతున్న గవాస్కర్.. ఈ పిల్ల చేష్టలు ఏంటని, ఇది క్రికెటే కాదని మండిపడ్డాడు. సరదా కోసం చేసినప్పుడు ఇషాన్ అప్పీల్ చేయాల్సింది కాదని మురళీ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఎవరైనా క్రికెటర్ ఇలా అంపైర్లను తప్పుదోవ పట్టిస్తే కఠిన శిక్షలు విధిస్తారు. ఆ తప్పు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.15 ప్రకారం.. ఇది లెవల్ 3 నేరం కిందకు వస్తుంది. కొన్నికొన్నిసార్లు ఈ నేరంలో ఆటగాడి మీద 4 నుంచి 12 వన్డేల వరకూ నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్‌పై నాలుగు వన్డేల నిషేధం తప్పదని న్యూజిలాండ్ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి.
కానీ శ్రీనాథ్ మాత్రం ఇషాన్‌ను మందలించి వదిలేసాడు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించాడు. అయితే శ్రీనాథ్ చర్యలు తీసుకోకపోవడానిక మరో కారణం కూడా ఉంది. ఈ ఘటనపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, నితిన్ మీనన్‌లు ఫిర్యాదు చేయకపోవడంతో శ్రీనాథ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోలేకపోయాడు. దాంతో అంపైర్ల సహకారంతో ఇషాన్ కిషన్ బతికిపోయాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అంపైర్లు కూడా ఈ ఘటనను సరాదాగా భావించారని అభిప్రాయపడుతున్నారు.