లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ ను మలుపు తిప్పిన సంఘటన... జేమ్స్ అండర్సన్ (James Anderson), జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) మధ్య జరిగిన గొడవే. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో జస్ప్రిత్ బుమ్రా బౌన్సర్లు వేయడం దగ్గర మొదలైందీ అసలు గొడవే. ఆ గొడవ నుంచి ఆట స్వరూపమే మారిపోయింది.
ఇక చివరి రోజు బుమ్రాని రెచ్చగొట్టారు ఇంగ్లండ్ ప్లేయర్స్. మార్క్ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపర్చే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి పని చెప్పారు. బట్లర్ కూడా బుమ్రాపై మాటల యుద్దానికి దిగాడు. దీంతో కోహ్లీ వారికీ ధీటుగా బదులిచ్చాడు. అయితే అసలు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఏం జరిగిందనేది లేటెస్ట్ గా బయటకొచ్చింది.
లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జేమ్స్ అండర్సన్‌కు బౌన్సర్లు సంధించిన జస్ప్రీత్ బుమ్రా అతడికి క్షమాపణ చెప్పాడట. కానీ ఇండియన్ పేస్ గుర్రం క్షమాపణను పట్టించుకోని జిమ్మీ.. బుమ్రా పక్కకు తోసేసి బూతు మాటలు అన్నాడట. ఆ మాటలే భారత జట్టు క్రికెటర్లలో అగ్నిజ్వాలను రగిలించాయని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తెలిపారు.
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో శ్రీధర్ ఈ విషయాలను చెప్పాడు. 'ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో చివరి బ్యాట్స్‌మన్‌గా జేమ్స్ అండర్సన్ వచ్చాడు. అప్పటికే ఆధిక్యం కోల్పోయిన భారత్ త్వరగా వికెట్లు తీయాల్సిన పరిస్థితి. దాంతో జస్ప్రీత్ బుమ్రా 90 మైళ్ల వేగంతో జిమ్మీకి బంతులు వేశాడు. షార్ట్ పిచ్ బంతులు సంధించడంతో అవి అండర్సన్‌కు తగిలాయి' అని శ్రీధర్ తెలిపాడు.
"బుమ్రా షార్ట్ పిచ్ బంతులు విసురుతుండడంతో అండర్సన్ స్పందించాడు. ఇంత వేగంగా ఎందుకు వేస్తున్నావు?, నీకు నేనిలాగే వేశానా?, ఇప్పటి వరకు నువ్వు 80 మైళ్ల వేగంతో వేశావు, నన్ను చూడగానే 90 మైళ్ల వేగంతో ఎందుకు విసురుతున్నావు? అని జిమ్మీ అన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియగానే కుర్రాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చేశారు.ఆ తర్వాత బుమ్రా వేగంగా వెళ్లి జిమ్మీ భుజం తట్టాడు. ఉద్దేశపూర్వకంగా బంతులు వేయలేదని వివరించాలన్నది అతడి ఉద్దేశం. బుమ్రా ఎంత మంచి వ్యక్తో మనందరికీ తెలుసు. అందుకే, ఆ వ్యవహారం అంతటితో ముగించేందుకు అతడి వద్దకు వెళ్లాడు. కానీ అండర్సన్ బుమ్రాను పక్కకు తోసేశాడు" అని ఫీల్డింగ్ కోచ్ తెలిపాడు.
మొత్తానికి ప్రశాంతంగా సాగిపోతున్న మ్యాచ్ లో అనవసరంగా టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టి అసలకే ఎసరు తెచ్చుకున్నారు ఇంగ్లీష్ ఆటగాళ్లు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ను కవ్వించి మరీ ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. మాతో పెట్టుకుంటే మడతడిపోద్దే అన్న తరహాలో చెలరేగిన భారత్ ఆటగాళ్లు చారిత్రాత్మక విజయాన్నందుకున్నారు.