ద ఒవల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇంగ్లండ్ సెట్ చేసిన చిన్న టార్గెట్ ను (111) ఒక్క వికెట్ కోల్పోకుండానే ఉఫ్ మని ఊదేసింది. ఓపెనర్లు వచ్చిన రోహిత్ శర్మ (Rohit Sharma) (76*), శిఖర్ ధావన్ (Shikhar Dhawan) (31*)..అదిరిపోయే ప్రదర్శనతో.. 18.4 ఓవర్లోనే భారత్ విజయం సాధించింది.
అంతకుముందు.. బుమ్రా (Jasprit Bumrah) (7.2 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 మెయిడెన్, 6 వికెట్లు) అయితే స్వింగ్ మ్యాజిక్‌తో ఇంగ్లండ్ ఆటగాళ్లకి చుక్కలు చూపించాడు. మహమ్మద్ షమీ(Mohammed Shami) (7 ఓవర్లలో 31 పరుగులు, 3 వికెట్లు) సైతం తన స్వింగ్ దెబ్బ రుచి చూపించాడు. ఏకంగా నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే ఔటయ్యారు. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ 25.2 ఓవర్లలోనే 110 పరుగులకి కుప్పకూలింది.
అయితే.. ఈ మ్యాచులో మూడు వికెట్లతో సత్తా చాటిన మహ్మద్ షమీ అదిరిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ మ్యాచులో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల మార్క్‌ని అందుకున్న మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 80 మ్యాచ్‌ల్లో షమీ ఆ ఫీట్‌ని అందుకున్నాడు.
అటు ఆఫ్గన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా అవే గణాంకాల్ని నమోదు చేయడంతో.. ఇద్దరూ సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకున్నారు. తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్(77 మ్యాచ్‌లు), పాకిస్తాన్ మాజీ స్టార్ సక్లెయిన్ ముస్తాక్ (78 మ్యాచ్‌లు) ఉన్నారు. రషీద్, షమీల తర్వాత ట్రెంట్ బౌల్ట్(81 మ్యాచ్‌లు), బ్రెట్ లీ(82 మ్యాచ్‌లు) నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు.
అయితే, టీమిండియా తరఫున మాత్రం 150 వికెట్ల మార్క్‌ని అత్యంత వేగంగా అందుకున్న తొలి బౌలర్‌గా షమీ నిలిచాడు. ఇంతకముందు అజిత్ అగార్కర్ 97 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మార్క్‌ని అందుకొని, ఇన్నాళ్లూ అగ్రస్థానంలో కొనసాగాడు. ఇప్పుడు షమీ 80 మ్యాచ్‌ల్లోనే ఆ మార్క్ అందుకొని, అగార్కర్ రికార్డ్‌ని బద్దలుకొట్టాడు.
ఇక బంతుల పరంగా చూసుకుంటే.. 150 వికెట్ల మైలురాయిని 4071 బంతుల్లో అందుకున్నాడు. దీంతో, అత్యంత తక్కువ బంతుల్లో ఈ ఫీట్ అందుకున్న ఐదో బౌలర్‌గా షమీ అవతరించాడు. మిచెల్ స్టార్క్ మాత్రం 3857 బంతుల్లోనే ఆ మైలురాయిని అందుకోగలిగాడు. అతని తర్వాత అజంతా మెండిస్(4029 బంతులు), సక్లెయిన్ ముస్తాక్ (4035 బంతులు), రషీద్ ఖాన్ (4040 బంతులు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.