టీమిండియా ప్లేయర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), మహ్మద్ షమీ(Mohammed Shami), ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna), మహ్మద్ సిరాజ్(Mohammad Siraj), ఛతేశ్వర్ పుజారా, శుభ్మాన్ గిల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్లు గురువారం ముంబై నుంచి ఇంగ్లాండ్కు బయలుదేరారు. దక్షిణాఫ్రికా సిరీస్ లో ఆడుతున్న శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆ తర్వాత బయలుదేరనున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ జూన్ 20న పలువురు వన్డే స్పెషలిస్ట్ ఆటగాళ్లు, ఇతర టెస్టు ఆటగాళ్లతో బెంగళూరు నుంచి బయలుదేరే బృందంతో కలిసి వెళ్తాడు. ఇటీవలే మాల్దీవులకి వెకేషన్కు వెళ్లొచ్చిన రోహిత్ కాస్త లేటుగా టీంతో జాయిన్ కానున్నాడు. ఇక యూకేకు బయల్దేరిన టెస్టు ఆటగాళ్ల బ్యాచ్లో ఆఫ్ స్పిన్నర్ ఆర్.అశ్విన్ కూడా కనిపించకపోవడం గమనార్హం. అశ్విన్ కూడా 20న యూకేకు బయలుదేరుతాడు.
ఈ సిరీసులో రోహిత్ శర్మ ఎంతో కీలకం. గతేడాది సిరీస్ లో టీమిండియా తరుఫున అత్యధిక పరుగులు చేసింది హిట్ మ్యానే. ఆడిన 4 టెస్టుల్లో రోహిత్ 368 పరుగులు చేశాడు. దీంతో.. రోహిత్ శర్మ మరోసారి కీలకం కానున్నాడు. గతేడాది ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో లార్డ్స్, ఓవల్లో విజయం సాధించిన భారత్ 2-1ఆధిక్యంలోకి ఉంది.
ఇకపోతే.. ఈ టెస్ట్ మ్యాచుకు ముందు టీమిండియా షాక్ తగిలింది. మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచుకు దూరం కానున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్ నుంచి కూడా కేఎల్ రాహుల్ ఔట్ అయిన సంగతి తెలిసిందే. రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు సెలెక్టర్లు.