గజ్జల్లో గాయం కారణంగా చివరి నిమిషంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో.. కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టుకు అతను దూరం కానున్నాడు.
'గజ్జల్లో గాయం నుంచి రాహుల్ కోలుకోలేదు. రాహుల్ జట్టుతో పాటు వెళ్లట్లేదు. కోలుకోవడానికి కేఎల్ రాహుల్ కి ఇంకా సమయం పడుతోంది.'అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఇక, రాహుల్ దూరమవ్వడంతో శుభ్ మన్ గిల్ రోహిత్ తో పాటు ఓపెనింగ్ దిగే ఛాన్సులున్నాయ్. పుజారాని కూడా ఓపెనింగ్ కు పంపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత టీమ్ ఐర్లాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. అతని నేతృత్వంలో 17 మంది సభ్యులను ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు సెలెక్టర్లు. జూన్ 26, 28వ తేదీల్లో ఐర్లాండ్‌తో భారత్ టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.