ఐదు టెస్ట్ ల ఇంగ్లాండ్ (England) పర్యటనలో తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా వెనుకబడి, లార్డ్స్‌లో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచిన టీమిండియా (Team India).. అదే జోరులో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూసింది. కానీ లీడ్స్ టెస్టులో భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. దీంతో భారత్ దాదాపు రేసులో వెనకపడినట్టే. మరోవైపు లార్డ్స్‌లో ఆట కంటే ఎక్కువ తమ వ్యవహార శైలితోనే వార్తల్లో నిలిచిన ఇంగ్లండ్.
ఆ పరాజయాన్ని పక్కనపెట్టి సిరీస్ సమం చేయాలని కృతనిశ్చయంతో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టే టీమిండియాను తక్కువ పరుగులకు ఆలౌట్ చేసింది. మూడో టెస్టుపై రూట్ (Joe Root) సేన ఇప్పటికే పైచేయి సాధించింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు భారత్ 40.4 ఓవర్లలో 78 పరుగులకు ఆలౌట్ అయింది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన 19 పరుగులే అత్యధికం. అయితే, టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడం ఆందోళనకు గురిచేస్తోంది.
టీమిండియా పదే పదే చేసిన ఈ తప్పులే కొంపముంచాయ్ అంటున్నారు క్రికెట్ పండితులు. భారత జట్టు ఖాతాలో టెస్టుల్లో మరోసారి లోయెస్ట్ స్కోర్‌ను నమోదు కావడం విమర్శల నోళ్లకు కూడా పని చెప్పినట్టయింది. రోహిత్ శర్మ, అజింక్య రహానె మినహా మరెవరూ డబుల్ డిజిట్‌ను అందుకోలేకపోయారు. రెండో టెస్ట్‌ను గెలిచిన ఓ జట్టు.. మూడో టెస్ట్‌లో కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడం పట్ల అటు అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతోన్నాయి.
బ్యాటింగే అనుకుంటే బౌలర్లు కూడా ఘోరంగా విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పుల్లాంటి బంతులను సంధించిన పిచ్ మీద రాణించలేకపోయారు. ఒక్క వికెట్‌ను కూడా పడగొట్టలేకపోయారు. ఏ మాత్రం ఫామ్‌లో లేని రోరీ బర్న్స్, ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ ఆడుతోన్న హసీబ్ హమీద్ అర్ధసెంచరీలను నమోదు చేశారు. 42 ఓవర్లను విసిరినప్పటికీ ఓపెనర్ల భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చేతులెత్తేశారు.
నాటింగ్ హామ్, లార్డ్స్ టెస్ట్ మ్యాచుల్లో సత్తా చాటిన టీమిండియా.. హెడింగ్లేకు వచ్చే సరికి నీరుగారిపోయినట్టు కనిపించింది. కొమ్ములు తిరిగిన బ్యాట్స్మెన్లు ఒకరివెంట ఒకరు పెవిలియన్ దారి పట్టారు. తొలి ఓవర్ నుంచే భారత జట్టు పతనం ఆరంభమైంది. స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్, క్రెగ్ ఓవర్టన్, ఒల్లీ రాబిన్సన్, సామ్ కర్రమ్‌లకు అలవోకగా తలవంచింది. కనీసం పోరాడలేకపోయింది. అండర్సన్, ఓవర్టన్ మూడు, రాబిన్సన్, సామ్ కర్రమ్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. సునాయాసంగా భారత్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
బ్యాటింగ్ విభాగంలో టీమిండియా భారీ స్కోరును అందుకోలేకపోవడం, బౌలింగ్ డిపార్ట్మెంట్లో అదే వైఫల్యం కొనసాగించడం విశ్లేషకుల మెదళ్లకు పని పెట్టాయి. దీనికి గల కారణాలను వివరిస్తోన్నారు క్రికెట్ పండితులు. ప్రధాన కారణాలను వారు వివరించారు. అవన్నీ సాంకేతికంగా అంగీకరించదగ్గవే. బ్యాటింగ్‌లో విఫలం కావడానికి, బౌలర్లు చేతులెత్తేయడానికి మధ్య టీమిండియా కొన్ని స్వయంకృతాపరాధాలకు పాల్పడినట్లు చెబుతున్నారు అనలిస్టులు.
టీమిండియా బ్యాట్స్మెన్ల షాట్ సెలెక్షన్ ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకించి డ్రైవ్‌ల విషయంలో అనేక పొరపాట్లు చేశారు. దీనికి ఉదాహరణ.. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లందరూ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం. బంతి వేగం, కదలికలను తక్కువగా అంచనా వేయడం వల్లే టైమింగ్ మిస్ అయ్యారు. తొలి ఓవర్ అయిదో బంతిగా అండర్సన్ విసిరిన ఇన్‌స్వింగర్‌ను అర్థం చేసుకోవడంలో తడబడ్డాడు కేఎల్ రాహుల్. ఎలా ఆడాలో తెలియక తికమక పడ్డాడు. నాలుగో ఓవర్లో చేతేశ్వర్ పుజారా పెవిలియన్ బాట పట్టాడు. కేఎల్ రాహుల్ అవుట్ అయిన విధానానికి రీప్లే చూస్తున్నట్టనిపించింది.
10వ ఓవర్ అయిదో బంతికి కోహ్లీ బ్యాటెత్తేశాడు. అండర్సన్ వేసిన అవుట్ స్వింగర్‌ను మిడాఫ్ దిశగా డ్రైవ్ చేయబోయాడు..అది సక్సెస్ కాలేదు. టైమింగ్ మిస్ కావడంతో బంతి మళ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని బట్లర్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ అవుటైన తీరు పట్ల సునీల్ గవాస్కర్ కూడా తప్పు పట్టారు. కవర్ డ్రైవ్‌లో అతని బలహీనతలేమిటో బయటపడిందని, లోపాన్ని సరిచేసుకోలేదని సన్నీ చెప్పాడు.
రెండో టెస్ట్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను ఆలస్యంగా అటాకింగ్‌కు దింపడం కూడా ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. కొత్తబంతితో సిరాజ్ అద్భుతాలను సృష్టిస్తాడనే విషయం తెలిసినప్పటికీ.. విరాట్ కోహ్లీ అతని చేతికి బంతిని ఆలస్యంగా ఎందుకు ఇచ్చాడనేది అంతుచిక్కట్లేదని వ్యాఖ్యానిస్తోన్నారు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ప్రభావం చూపట్లేదనది తెలిసిన వెంటనే బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాల్సి ఉన్నప్పటికీ.. టీమిండియా కెప్టెన్ ఆ పని చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.