ముఖ్యంగా బుమ్రా (Jasprit Bumrah), అండర్సన్ (James Anderson), కోహ్లీ (Virat Kohli), బట్లర్ (Jos Buttler) మధ్య జరిగిన సంభాషణ టెస్టులో వేడిని పుట్టించింది. తప్పు ఎవరిదైనా ఇరు జట్లు ఒకరిని ఒకరు కవ్వించుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు కవ్వింపుల కారణంగానే మేము మరింత పట్టుదలగా ఆడి విజయం సాధించామని రెండవ టెస్టు ముగిసిన అనంతరం కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.
అయితే, మూడో టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కాస్తా క్రికెట్ ప్రపంచంలో పెద్దఎత్తున హాట్ టాపిక్ గా మారింది. దీనిమీద డిబేట్లు సాగుతున్నాయి. దీని ప్రభావం.. మూడో టెస్ట్ మ్యాచ్‌పై పడే అవకాశాలు లేకపోలేదు. రెండు జట్ల క్రికెటర్లు, కేప్టెన్ల ఆటతీరు, వారి వ్యూహాలను ప్రభావితం చేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం కావడానికి కారణమైంది. జెంటిల్మెన్ గేమ్‌గా పేరును ఆర్జించుకున్న క్రికెట్‌కు మచ్చగా పరిగణిస్తోన్నారు కొందరు మాజీ క్రికెటర్లు, పలువురు అభిమానులు.
రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కోహ్లీసేన నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. పేస్ బౌలింగ్ త్రయం జస్ప్రీత్ బుమ్రా-మహ్మద్ షమీ-ఇషాంత్ శర్మ విజృంభణ ముందు నిలవలేకపోయింది. అలవోకగా తల వంచింది. నిర్ణయాత్మకమైన రెండో ఇన్నింగ్‌లో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానంలో భారత్ చేతిలో 151 పరుగుల తేడాతో మట్టి కరిచింది. మూడో టెస్ట్‌లో ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే కసిని రగిలింపజేసింది.
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఎలాంటిదో మనకు తెలుసు. క్రికెట్ అంటే ఇష్టపడే ప్రతి అభిమానికి కూడా లార్డ్స్‌కు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. క్రికెట్ మక్కాగా పేరున్న స్టేడియం అది. అలాంటి స్టేడియంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు చేతిలో ఓడిపోవడాన్ని ఇంగ్లాండ్ జట్లు తలవంపులుగా భావించినట్టుంది. 271 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయామనే ఆగ్రహావేశాలు జట్టు ప్లేయర్లలో వ్యక్తమయ్యాయి.
ఈ మ్యాచ్ ముగిసిన తరువాత.. విరాట్ కోహ్లీ-జో రూట్ మధ్య వాడివేడిగా వాగ్యుద్ధం నడిచినట్లు తెలుస్తోంది. దీనికి లార్డ్స్ పెవిలియన్ లాంగ్‌రూమ్ వేదికగా మారాయని సమాచారం. రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు జస్ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్ టెయిలెండ్ బ్యాట్స్‌మెన్ జిమ్మీ అండర్సన్‌ను టార్గెట్‌గా చేసుకుని వరుసగా షార్ట్ పిచ్ బంతులను సంధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఆ ఇద్దరి మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఆ తరువాత అదే హీటెడ్ ఆర్గ్యుమెంట్ కొనసాగినట్లు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన డెయిలీ టెలిగ్రాఫ్ తెలిపింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం లార్డ్స్ స్టాఫ్, క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు తిరుగాడే లాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్న డెయిలీ టెలిగ్రాఫ్ తెలిపింది. లార్డ్స్ లాంగ్ రూమ్‌ను రెండు జట్ల క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్కు కామన్ పాయింట్‌గా చెబుతుంటారు. గ్రౌండ్ నుంచి వచ్చిన రెండు జట్ల ఆటగాళ్లు ఈ లాంగ్ రూమ్ పాయింట్ మీదుగానే తమ తమ డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిందన్న వార్తలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయ్.