ప్రశాంతంగా సాగిపోతున్న మ్యాచ్ లో అనవసరంగా టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టి అసలకే ఎసరు తెచ్చుకున్నారు ఇంగ్లీష్ ఆటగాళ్లు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ను కవ్వించి మరీ ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. అసలు రెండో టెస్ట్ ను మలుపు తిప్పిన సంఘటన... జేమ్స్ అండర్సన్ (James Anderson), జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) మధ్య జరిగిన గొడవే.
తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో జస్ప్రిత్ బుమ్రా బౌన్సర్లు వేయడం దగ్గర మొదలైందీ అసలు గొడవే. ఆ గొడవ నుంచి ఆట స్వరూపమే మారిపోయింది. ఆ తర్వాత చివరి రోజు బుమ్రాని రెచ్చగొట్టారు ఇంగ్లండ్ ప్లేయర్స్. మార్క్ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపర్చే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి పని చెప్పారు. బట్లర్ కూడా బుమ్రాపై మాటల యుద్దానికి దిగాడు. దీంతో కోహ్లీ వారికీ ధీటుగా బదులిచ్చాడు.
అయితే లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్ పేసర్లు వరుసగా బౌన్సర్లు సంధించడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తప్పుబట్టాడు. ఈ విషయంలో దారి తప్పిన కెప్టెన్ జోరూట్‌ను కోచ్ సిల్వర్ వుడ్ సరిచేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ ఒక్క తప్పిదంతోనే ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుందన్నాడు. ఈ దిక్కుమాలిన చర్యతోనే సిరీస్ లో ఆధిక్యాన్ని సాధించే అవకాశాన్ని కోల్పోయారని అభిప్రాయపడ్డాడు.
రెండో టెస్టులో బుమ్రా, షమీ బ్యాటింగే కీలక సమయమని, అదే సమయంలో ఇంగ్లండ్ మ్యాచ్‌లో వెనుకబడిందని అన్నాడు. దీంతో మ్యాచ్ గెలిచే అవకాశాన్ని ఇంగ్లండ్ చేజేతులా నాశనం చేసుకుందని చెప్పాడు. ఈ ఓటమికి సిల్వర్‌వుడ్ కూడా బాధ్యత వహించాలన్నాడు. ఇక మిగిలిన సిరీస్‌లోనైనా ఇంగ్లండ్ కోచ్ తన స్థాయికి తగ్గ మార్పును జట్టులో తీసుకురావాలని కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన దారిలో ముందుకు సాగుతున్నాడని, ఎలాంటి తప్పులు చేయడం లేదని వాన్ పేర్కొన్నాడు.
లార్డ్స్ టెస్ట్‌లో 151 పరుగులతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన కోహ్లీసేన చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఫలితంగా ఐదు టెస్టుల సిరీసులో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వర్షం కారణంగా మొదటి టెస్టును డ్రా చేసుకున్న కోహ్లీ సేన రెండో టెస్టులో అద్వితీయమైన విజయం అందుకుంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ కలిసి రాణించారు. ఆఖరి రోజు భారత పేసర్లు ఆంగ్లేయులను కేవలం 60 ఓవర్లలోపే ఆలౌట్ చేసి విజయం అందించడం ప్రత్యేకం. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
మొత్తానికి ప్రశాంతంగా సాగిపోతున్న మ్యాచ్ లో అనవసరంగా టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టి అసలకే ఎసరు తెచ్చుకున్నారు ఇంగ్లీష్ ఆటగాళ్లు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ను కవ్వించి మరీ ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. మాతో పెట్టుకుంటే మడతడిపోద్దే అన్న తరహాలో చెలరేగిన భారత్ ఆటగాళ్లు చారిత్రాత్మక విజయాన్నందుకున్నారు.