26 ఏళ్ల కుల్దీప్ సేన్ మధ్యప్రదేశ్‌లో రెవా జిల్లాలోని చిన్న గ్రామం హరిహర్పూర్లో జన్మించాడు. కుల్దీప్ తండ్రి రాంపాల్ సేన్ తన గ్రామంలోనే చిన్న హెయిర్ సెలూన్ నడుపుతూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. రాంపాల్‌కు ఐదుగురు సంతానం. వారిలో కుల్దీప్ సేన్ మూడవ వాడు. కుల్దీప్ చిన్నతనంలో తినడానికి తిండి కూడా సరిగ్గా లేకపోయేది.
‘బార్బర్ గా నేను గత 30 ఏళ్లుగా పని చేస్తున్నా. టీమిండియా తరఫున కుల్దీప్ సేన్ అరంగేట్రం చేయడం నాకు గర్వంగా ఉంది. కుల్దీప్ కు చిన్న తనం నుంచే క్రికెట్ అంటే ఇష్టం. అయితే నేను అతడి ఇష్టాన్ని ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. క్రికెట్ ఆడుతుంటే తిట్టేవాడిని.. కొన్ని సార్లు కొట్టేవాడిని కూడా. కానీ, కుల్దీప్ క్రికెట్ ను వదల్లేదు. కలను సాకారం చేసుకున్నాడు. ఆనందంగా ఉంది’ అంటూ రాంపాల్ సేన్ పేర్కొన్నాడు.