ఏడేళ్ల క్రితం మహేంద్ర సిగ్ ధోనీ సారథ్యంలో ఓడిన టీమిండియా.. ఇప్పుడేమో రోహిత్ శర్మ కెప్టెన్సీలో అదే ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ రెండు వన్డేల్లో టీమిండియా స్వీయ తప్పిదాలతోనే ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన ఓటమి పాలైంది. మెహ్దీ హసన్ సంచలన ప్రదర్శనకు తోడు రాహుల్ ద్రవిడ్ అతిప్రయోగాలు టీమిండియా కొంపముంచాయి.
గతేడాది టి20 ప్రపంచకప్ లో టీమిండియా సూపర్ 12 నుంచే ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. అనంతరం టీమిండియాలో భారీ మార్పులు జరిగాయి. కెప్టెన్సీ మార్పుతో పాటు కోచ్ గా ద్రవిడ్ వచ్చాడు.ఒక కోచ్ గా భారత్ గెలిచిన మ్యాచ్ ల్లోనూ కనిపించని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి టీంను మరింత బలంగా తయారు చేయాల్సిన బాధ్యత కోచ్ గా ద్రవిడ్ కు ఉంటుంది. అయితే అతడు భారత సమస్యలను పరిష్కరించలేకపోయాడు.
రాహుల్ ద్రవిడ్ ది డిఫెన్సివ్ మైండ్ సెట్ అని మనందరికీ తెలుసు. అదే, ఇప్పుడు టీమిండియా కొంపముంచుతుంది. ఏది ఏమైనా రవిశాస్త్రి.. ద్రవిడ్ కన్నా వంద రెట్టు బెటర్ అన్పిస్తుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాహుల్ ద్రవిడ్ విపరీతమైన ప్రయోగాలు చేస్తూ విఫలమవుతున్నాడు. ఏడాదిలో 8 మంది కెప్టెన్లను మార్చాడంటే అతను ఎన్ని ప్రయోగాలు చేశాడో అర్థం చేసుకోవచ్చు.
టీమిండియా ఓపెనర్ల దగ్గర్నుంచి బ్యాటింగ్ ఆర్డర్ దాకా ప్రతీ మ్యాచ్‌లోనూ ప్రయోగాలు చేస్తున్న హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్... టీమ్‌ని కుదురుకోవడానికి సమయం కూడా లేకుండా చేస్తున్నాడని అభిమానులు మండిపడుతున్నారు. ద్రవిడ్ ఇదే ధోరణిలో ఉంటే మాత్రం వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ లోనూ టీమిండియా గ్రూప్ మ్యాచ్ ల్లో అదరగొట్టి.. ఆ తర్వాత నాకౌట్ పోరుల్లో బొక్క బోర్లా పడటం ఖాయం.