భారత్ (India), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో టీమిండియా మూడు వికెట్లతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రవిచంద్రన్ అశ్విన్ (62 బంతుల్లో 42 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు, 1 సిక్సర్), శ్రేయస్ అయ్యర్ (46 బంతుల్లో 29 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు) అజేయులుగా నిలవడంతో టీమిండియాకు సూపర్ విక్టరీని అందించారు.
టెస్టు ఫార్మాట్‌కు ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ ముగియనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్ల పట్టికలో నిలిచే తొలి రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలుస్తుంది.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా జట్టు 60 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఓటమి తర్వాత ప్రొటీస్ జట్టు మూడో స్థానానికి పడిపోయింది. సఫారీకి 54.55 విజయాల శాతం ఉంది. సౌతాఫ్రికా ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆరు మ్యాచుల్లో నెగ్గగా.. మరో ఐదింటిలో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. ప్రస్తుత ఆస్ట్రేలియా ఫాం చూస్తే.. దక్షిణాఫ్రికా కంగారూల్ని ఓడించడం దాదాపు అసాధ్యం. (AP)
అదే సమయంలో పాకిస్తాన్ ను మట్టికరిపించిన ఇంగ్లండ్ కు 46.97 విజయ శాతం ఉంది. 22 మ్యాచ్‌లు ఆడగా 10 గెలిచింది. మరో 4 మ్యాచులు డ్రా అయ్యాయి. 8 మ్యాచుల్లో ఓడిపోయింది స్టోక్స్ సేన. ఇక, డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ లో ఏడో స్థానంలో నిలిచింది పాకిస్తాన్. అయితే, బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు కూడా ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రస్తుత సీజన్ లో టీమ్ ఇండియా ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌ల్లో కనీసం 3 మ్యాచ్‌లు గెలవాలి. ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో 4-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడవలసి ఉంది. ఆస్ట్రేలియాపై విజయం సాధించడం అంత సులువు కాదు. ఈ సిరీస్ సమయానికి రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఇద్దరి వస్తే ఆస్ట్రేలియాకు తిప్పలు తప్పవు. (AP)