ఆతిథ్య ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయం చవిచూసిన భారత జట్టు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది. సొంతగడ్డపై రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్ సై అంటుంటే.. ఎన్నో ప్రతికూలతల మధ్య భారత్ బరిలోకి దిగుతోంది.ఆస్ట్రేలియాలో 0-1తో వెనుకబడ్డాక పుంజుకోవడం అంటే తేలిక కాదు. విరాట్ కోహ్లీ, మొహ్మద్ షమీ కూడా లేకపోవడం భారత్ పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ బౌలింగ్, బ్యాటింగ్‌లో అసాధారణ ప్రదర్శన చేయక తప్పదు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్‌కు ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్, హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు. పృథ్వి షా స్థానంలో తుది జట్టులోకి వస్తున్న గిల్.. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు.
అయితే ఆసీస్ పేస్ దాడిని తట్టుకుంటూ ఇన్నింగ్స్‌ను బలంగా ఆరంభించడం ఎంతో కీలకం. అగర్వాల్ ఫామ్‌ను అందుకోవాల్సివుంది. గిల్ సన్నాహక పోరులో చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పితే టీమిండియాకు తిరుగుండదు.విరాట్ కోహ్లీ గైర్హాజరీలో చటేశ్వర్ పుజారా, అజింక్య రహానేలపై మరింత బాధ్యత పెరిగింది.
ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. వీరు క్రీజులో చాలా సమయం గడిపితే.. పరుగులు అవే వస్తాయి. కోహ్లీ స్థానంలో హనుమ విహారి ఆడుతున్నాడు. గత మ్యాచులో విఫలమయిన విహారి సత్తాచాటాల్సి ఉంది. బ్యాటింగ్ పదును పెంచేందుకు వృద్ధిమాన్ సాహా స్థానంలో వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి వచ్చాడు. విమర్శలు ఎదుర్కొంటున్న పంత్.. భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఎంతో ఉంది. తొలి టీ20లో గాయపడిన రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చాడు. ఇది ఆనందించదగిన విషయం.
స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాలి. మొదటిటెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన స్టార్ బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్ ఆడుతున్నాడు. పేస్ బౌలర్ల కోటాలో ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. ఆసీస్ ఆటగాళ్లను కట్టడి చేస్తేనే విజయావకాశాలు ఉంటాయి. సిరీస్‌లో ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో మ్యాచ్‌కు సిద్ధమైంది. గాయాలు వేధిస్తున్నా ఆ జట్టు భారత్ కన్నా సమతూకంగానే ఉంది. పేస్ బౌలింగ్ ఆ జట్టుకు పెద్ద బలం. రెండో టెస్టుకి తుది జట్టులో తాము ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ స్పష్టం చేశాడు.
మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో భారత్‌పై ఆస్ట్రేలియాకు మంచి రికార్డుంది. ఇక్కడ ఈ రెండు జట్లు 13 టెస్టుల్లో తలపడగా.. ఆస్ట్రేలియా ఎనిమిది నెగ్గింది. భారత్ మూడు టెస్టుల్లో గెలవగా.. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయమేంటంటే.. చివరిసారి ఇక్కడ ఆసీస్‌తో ఆడిన టెస్టులో 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడమే. 2011 నుంచి మెల్బోర్న్లో భారత్ ఓడిపోలేదు.
మెల్బోర్న్ క్రికెట్ మైదానం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. అయితే ఆరంభంలో కొత్త బంతిని ఎదుర్కోవడం మాత్రం బ్యాట్స్‌మెన్‌కు కష్టమే. నిలదొక్కుకుంటే మాత్రం బ్యాటింగ్ తేలికవుతుంది. అయితే పిచ్ క్రమంగా క్షీణిస్తుంది. అప్పుడు స్పిన్నర్లకు సహకారం లభించవచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం మాత్రం లేదు.