ప్రస్తుతం క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy)పైనే ఉన్నాయి. త్వరలో ప్రారంభంకానున్న ఈ సిరీస్‌కు భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) సన్నద్ధం అవుతున్నాయి. ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న ఆటగాళ్లలో టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. స్వదేశంలో 2013 సిరీస్ నుంచి ఆస్ట్రేలియాపై అశ్విన్ నమోదు చేసిన గణాంకాలే అందుకు కారణం.
అశ్విన్ బౌలింగ్ శైలిని పోలిఉండే నెట్ బౌలర్‌ను ఆస్ట్రేలియా కనుగొన్నట్లు వార్తలు వస్తున్నాయంటే.. అతను ఆసీస్‌కు ఎంత పెద్ద ముప్పో గమనించవచ్చు. అశ్విన్ స్పిన్ అస్త్రానికి దాదాపు అందరు ఆసీస్ ఆటగాళ్లు వికెట్లు సమర్పించుకున్నారు. అయితే ఈ ట్రోఫీలో అశ్విన్ నుంచి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోనున్న ఆటగాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం.
* ట్రావిస్ హెడ్ : గతేడాది ఆస్ట్రేలియా అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు ట్రావిస్ హెడ్. టెస్ట్, వన్డే క్రికెట్లో అతని ఫాంపై ఆసీస్ జట్టు చాలా ఆశలే పెట్టుకుంది. భారత్‌లో ట్రావిస్ హెడ్‌కి ఇదే తొలి టెస్టు సిరీస్. ఆస్ట్రేలియాలో అతని గణాంకాలు అద్భుతంగా ఉన్నప్పటికీ, అతను ఉపఖండంలో రాణించలేకపోయాడు. గత సంవత్సరం పాకిస్థాన్, శ్రీలంకలో ఐదు మ్యాచ్‌లలో 100 కంటే తక్కువ పరుగులు చేశాడు.
గతంలో ఆస్ట్రేలియాలో అతను, అశ్విన్ బౌలింగ్ ఎదుర్కొన్నాడు. 31 పరుగులు చేసి ఒకసారి ఔటయ్యాడు. ఉపఖండంలో భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ట్రావిస్ హెడ్‌కు భారీ పరీక్ష అని చెప్పవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై అశ్విన్ ఆధిపత్యం, ప్రత్యేకించి స్వదేశంలో అతని ప్రదర్శనను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
వాస్తవానికి ఆస్ట్రేలియా ఆసియాలో ఆడినప్పుడు కీలక ఆటగాళ్లలో ఖవాజా ఒకడు. అయితే అతను భారతదేశంలో ఇంకా టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అతను ఎలా ఆడతాడనే దానిపై వివిధ రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అయిన ఖవాజా, ఇండియన్ పిచ్‌లపై అశ్విన్‌ను ఎదుర్కోవడం అంత సులువైతే కాదు.