చెన్నై వేదికగా భారత్- ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య రేపు మూడో వన్డే జరగనుంది. మొదటి మ్యాచ్‌లో భారత్ గెలవగా, రెండో వన్డేలో ఆసీస్ విజయం సాధించింది. చివరిదైన మూడో వన్డే, ఈ సిరీస్‌ను డిసైడ్ చేయనుంది. దీంతో ఇరు జట్లకు రేపటి మ్యాచ్ కీలకం కానుంది. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో మరింత స్ట్రాంగ్‌గా మారేందుకు రెండు టీమ్స్‌లో కొన్ని మార్పులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం.
* తుది జట్టులో మ్యాక్స్‌వెల్ ? : నిర్ణయాత్మక మూడో వన్డే కోసం ఆసీస్ జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. నాథన్ ఎల్లిస్ స్థానంలో ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను తీసుకునే అవకాశం ఉంది. చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో మాక్స్‌వెల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ టీమ్ మరింత పటిష్టంగా ఉంటుందని ఆ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
* భారత జట్టు : రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బలంగానే కనిపిస్తోంది. రేపటి తుది జట్టులో కెప్టెన్‌తో పాటు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్/శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఉండవచ్చు.
* సూర్య స్థానంలో ఇషాన్‌కు ఛాన్స్? : మిస్టర్ 360 డిగ్రీ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో సత్తా చాటుతున్నా, వన్డేల్లో మాత్రం ఆకట్టుకోవట్లేదు. టీ20ల్లో సూర్య నెం.1 బ్యాటర్. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. గత రెండు వన్డేల్లో డకౌట్ కావడంతో మూడో వన్డేలో అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకుంటే బెటర్ అని క్రికెట్ పండితులు అంటున్నారు.
సూర్య టీ20ల మాదిరి ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో అతన్ని పక్కనపెట్టి ఇషాన్ కిషన్‌ను ఆడిస్తే కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ భారత్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ విషయంలో ఎవరిని తుది జట్టులో తీసుకోవాలి అనేది పిచ్ సహకారం బట్టి టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. స్పిన్నర్లకు పిచ్ అనుకూలిస్తే.. అక్షర్‌ను తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.
* మొదటి వన్డేలో భారత్, రెండో వన్డేలో ఆసీస్ : ముంబైలో జరిగిన మొదటి వన్డేలో భారత్ గెలవగా, విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్ భారత్‌పై అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించి సిరీస్‌ను సమం చేసింది. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగడంతో భారత్ 117 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌పై భారత్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
* ర్యాంకింగ్స్ పరంగా మూడో వన్డే కీలకం : రెండు జట్లకు ర్యాంకింగ్స్ పరంగా కూడా మూడో వన్డే కీలకం కానుంది. ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అగ్రస్థానాన్ని నెలబెట్టుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. ఒకవేళ ఆసీస్ గెలిస్తే 2-1 తేడాతో వన్డే సిరీస్ సొంతం చేసుకోవడంతో పాటు వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ప్లేస్‌కు చేరుతుంది. దీంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.