ఈ క్రమంలో అజింక్యా రహానే కెప్టెన్ గా బాధ్యతలు చేపడతాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్ లో అజేయంగా ఉండి టీమిండియాను గెలిపిస్తాడు. అంతేకాకుండా నాలుగో టెస్టులోనూ తన కెప్టెన్సీతో టీమిండియాను గెలిపించి సిరీస్ ను సాధిస్తాడు. అయితే ప్రస్తుతం టీమిండియాలో రహానేకు చోటు లేదు. ఆ సిరీస్ ను తన కెప్టెన్సీతో భారత్ కు దక్కేలా చేసిన రహానే గురించి పెద్దగా మాట్లాడరు.
ఈ జాబితాలో తర్వాతి స్థానంలో హనుమ విహారీ ఉన్నాడు. ముఖ్యంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో తొడ కండరాల గాయంతోనే బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ డ్రాగా ముగిసేందుకు పోరాడతాడు. రెండో ఇన్నింగ్స్ లో విహారీ ఒంటి కాలితో బ్యాటింగ్ చేశాడనే చెప్పాలి.161 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేసిన విహారీ ఇన్నింగ్స్ ఎప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతుంది. అయితే ప్రస్తుతం జరగనున్న బోర్డర్ గావస్కర్ సిరీస్ లో విహారీకి చోటు దక్కలేదు.
2020లో జరిగిన ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున నటరాజన్ అద్భుతంగా రాణిస్తాడు. దాంతో అతడు నెట్ బౌలర్ గా టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్తాడు. అయితే అనూహ్యంగా వన్డే, టి20ల్లో డెబ్యూ చేస్తాడు. ఇక చివరి టెస్టు మ్యాచ్ కు గాయంతో బుమ్రా తప్పుకోగా.. అతడి స్థానంలో నటరాజన్ బరిలోకి దిగతాడు. దిగడమే కాదు తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీస్తాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆ టైంలో నటరాజన్ సడెన్ స్టార్. అయితే అనంతరం గాయాల బారిన పడ్డ అతడు టీమిండియాకు దూరమయ్యాడు.
వీరితో పాటు ఆ సిరీస్ గెలవడంలో రిషభ్ పంత్ ముఖ్య పాత్ర పోషించాడు. ముఖ్యంగా చివరి రెండు టెస్టుల్లో పంత్ ఆస్ట్రేలియా బౌలింగ్ ను చీల్చి చెండాడుతాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో పెద్దగా పరుగులు చేయని పంత్.. టెస్టుల్లో మాత్రం మంచి ప్రదర్శనలే చేశాడు. కారు ప్రమాదానికి గురి కాకుంటే పంత్ ఈ బోర్డర్ గావస్కర్ సిరీస్ లో తప్పకుండా ఆడేవాడు.