మరో నాలుగు రోజుల్లో భారత్-ఇంగ్లండ్ (India vs England) మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభంకానుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-22లో జరిగే ఫస్ట్ సిరీస్ ఇదే కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఆగష్టు 4 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీని కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. నెట్స్ లో చెమటోడుస్తున్నారు.
ఇక, ఇంగ్లండ్ గడ్డపై భారత్ రికార్డు పేలవంగా ఉంది. ఇప్పటిదాకా మొత్తం 63 టెస్టులు ఆడిన టీమిండియా కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. 35 టెస్టుల్లో ఓటమి చవి చూడగా.. 21 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇక ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా టీమిండియా పరాజయం పాలైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. మరి ఈసారైన టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా.? లేదా.? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇంగ్లండ్ గడ్డపై అందరూ ప్లేయర్ల సమిష్టిగా రాణిస్తేనే టీమిండియా సత్తా చాటుతోంది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్ మన్ రాణించాలి. రోహిత్ శర్మ తో పాటు విరాట్ కోహ్లీ, అజింక్య రహానే సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, షమీ ఫామ్ లోకి రావాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా టచ్ లోకి రాకపోతే ప్రత్యామ్నాయంగా సిరాజ్ ను జట్టులోకి తీసుకుంటే మంచిదని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.