క్రికెట్ అంటే జెంటిల్ మేన్ గేమ్ అంటుంటారు. అయితే ఆ క్రికెట్లో జరిగిన ఘటనలు ఈ గేమ్ మీద ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతాయ్. ఆనాటి విండీస్ కెప్టెన్ టోనీ గ్రేగ్ బానిస వ్యాఖ్యల నుంచి మంకీ గేట్ ఉదంతం వరకు.. డీన్ జోన్స్ ఆమ్లాను టెర్రరిస్ట్ అనడం నుంచి సౌతాఫ్రికా క్రికెట్ యొక్క కేప్ టౌన్ వర్ణ వివక్ష ఘటనలు ఎన్నో క్రికెట్ లోనే అసహ్యమైనవిగా చరిత్రలో నిలిచిపోయాయ్. ఈ జాతి వివక్ష ఘటనలు జెంటిల్ మేన్ గేమ్ కే మాయని మచ్చ తెచ్చాయ్. ముఖ్యంగా జోన్స్ ఆమ్లాను టెర్రరిస్ట్ తో పోల్చడం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది.
ఇక, మంకీ గేట్ వివాదాన్ని భారత క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ సైమండ్స్ ను భజ్జీ మంకీతో సంబోందించినట్లు అప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. అయితే, హర్భజన్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని టీమిండియా ఆటగాళ్లు పేర్కొన్నారు. మొత్తానికి ఈ వివాదం ఆ సిరీస్ ను రసవత్తరంగా సాగేలా చేసింది.
2019 పాకిస్థాన్, సౌతాఫ్రికా సిరీస్ లో జరిగిన ఘటన కూడా పెద్ద దుమారాన్నే రేపింది. ఆ సిరీస్ లో రెండో వన్డే సందర్భంగా సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ఆండ్లే పెహులుక్వాయాను జాతి వివక్ష వ్యాఖ్యలతో కించపరిచాడు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. పాకిస్థాన్ సారధి చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్ లో రికార్డవ్వడంతో అతని నాలుగు మ్యాచ్ ల నిషేధం విధించింది ఐసీసీ.
ఇక, ఇంగ్లండ్ మాజీ సారధి టోనీ గ్రేగ్ చేసిన వ్యాఖ్యలు వెస్టిండీస్ క్రికెట్ స్వరూపానే మార్చేశాయ్. అప్పట్లో టోనీ గ్రేగ్ వెస్టిండీస్ క్రికెటర్లను బానిసలతో పోల్చాడు. దీంతో, టోనీ గ్రేగ్ వ్యాఖ్యలు వెస్టిండీస్ డ్రెస్సింగ్రూమ్ను ఆగ్రహావేశాలకు ప్రేరేపించాయి. జట్టులోని ప్రతి ఒక్కరి మాదిరిగానే రిచర్డ్స్ సైతం ఆ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు, ఐదు టెస్టుల్లో 829 పరుగులు పిండుకున్నాడు. రెండు డబుల్ సెంచరీలు బాదాడు. అందులో రిచర్డ్స్ అత్యధిక స్కోరు 291 సైతం ఉంది. ప్రపంచ జట్ల బౌలర్లను ఉతికారేసేందుకు రిచర్డ్స్ వస్తున్నాడనే సంకేతం ఈ సిరీస్ నుంచే వెలువడింది.