అండర్–19 ప్రపంచకప్ (ICC Under-19 World Cup 2022)లో యశ్ ధుల్ నాయకత్వంలోని యంగ్ భారత్ (Team India) అదరగొట్టింది. సౌతాఫ్రికాపై సూపర్ విక్టరీతో టోర్నీని అద్భుత విజయంతో ప్రారంభించింది. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి 45 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సారథి యశ్ ధుల్ 82 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... బౌలర్ విక్కీ ఒత్వాల్ అద్భుతంగా రాణించాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన విక్కీ.. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
వెస్టిండీస్ వేదికగా అండర్- 19 ప్రపంచకప్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్- బిలోని భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... యశ్ సేన 232 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ప్రొటిస్ యువ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.
ఓపెనర్లు జాన్ డకౌట్ కాగా... వాలంటైన్ 25 పరుగులు చేసి నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రెవిస్ ఒక్కడే 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్ విక్కీ 5 వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. రాజ్ బవా 4 వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో 187 పరుగులకే దక్షిణాఫ్రికా చాపచుట్టేసింది. దీంతో 45 పరుగుల తేడాతో విజయం టీమిండియా సొంతమైంది.
భారత జట్టు తన తర్వాతి మ్యాచ్ జూన్ 19న ఐర్లాండ్‌తో ఆడనుంది. జూన్ 22న ఉగాండాతో మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. నాలుగు సార్లు అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత యువ జట్టు, ఈసారి కూడా టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. గత అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలోనూ ఫైనల్ చేరిన భారత యువ జట్టు, తుది పోరుతో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడింది.