టెస్ట్ బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో పంత్ ఆరో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ను వెనక్కి నెట్టి ఈ ఫీట్ ను సాధించాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్.ఇంతకుముందు 9వ స్థానంలో ఉన్న పంత్.. మూడు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. అతడికే ఇదే అత్యుత్తమ ర్యాంక్. 23 ఏళ్ల వయసులోనే పంత్ ఈ ఘనత సాధించడం విశేషం.
ఐసీసీ టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్ టాప్-10లో వికెట్ కీపర్ బ్యాట్స్మన్ చోటు దక్కించుకోవడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. భారత వికెట్ కీపర్ ఈ ఫార్మాట్లో సాధించిన అత్యధిక ర్యాంకింగ్ కూడా ఇదే. అంతకుముందు ఆస్ట్రేలియా, ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన పంత్.. ర్యాంకింగ్ పాయింట్లను మెరుగుపరచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత కొద్ది రోజులుగా అన్ని ఫార్మాట్లలో పంత్ పరుగుల వరదపారిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీసులను భారత్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
గతంలో పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న రిషబ్ పంత్.. గత ఐదు ఆరు నెలల్లోనే భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. ఇక, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. తన టీమ్ ను ఈ సీజన్ లో ముందుండి నడిపించాడు. అయితే, కరోనా ఎఫెక్ట్ తో ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడింది.