అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అందరూ ఊహించినట్టే ఐపీఎల్ స్టార్స్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు చోటు దక్కింది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా బీసీసీఐ చోటిచ్చింది. భారత జట్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.
ఇక, టీమిండియాను మెగాటోర్నీలో ముందుండి నడిపించనున్నాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). ఈ ధనాధన్ కప్ గెలవాలంటే కోహ్లీ.. బ్యాట్స్‌మన్‌గా జట్టుకు చాలా కీలకం. కోహ్లీ కెరీర్లో 90 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. 52.65 సగటుతో 3159 పరుగులు చేశాడు. ఇందులో 28 అర్ధ సెంచరీలు చేశాడు. కానీ, ఇప్పటి వరకు కోహ్లీ బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ కోహ్లీనే.
సూర్య కుమార్ యాదవ్ ఇంగ్లండ్ పై టీ-20 అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత శ్రీలంక గడ్డపై కూడా అతను రాణించాడు. అతను అంతర్జాతీయ స్థాయిలో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 169.51 స్ట్రైక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఐపీఎల్, దేశీయ క్రికెట్లో అతని రికార్డు అద్భుతంగా ఉంది. ఇక, ఐపీఎల్ సూర్య కుమార్ యాదవ్ మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు.
ఇక, టీ-20 లో గెలుపు గుర్రాల్లో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. టీమిండియా నెగ్గాలంటే అతడు రాణించడం చాలా కీలకం. తన కెరీర్లో ఇప్పటి వరకు 50 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 6.66 ఎకానమీ రేటుతో 59 వికెట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా డెత్ బౌలింగ్ లో యార్కర్లతో ప్రత్యర్ధుల ఆటకట్టించడంలో బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు.
ఇక, కుల్దీప్, చాహల్ లాంటి సీనియర్ లెగ్ స్పిన్ బౌలర్లు పక్కనపెట్టి యంగ్ గన్ రాహుల్ చాహర్ పై నమ్మకముంచారు టీమిండియా సెలక్టర్లు. రాహుల్ చాహర్ అంతర్జాతీయ స్థాయిలో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో, అతను 7.60 ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు పడగొట్టాడు. దేశీయ స్థాయిలో 66 టీ 20 మ్యాచ్‌ల్లో 7.32 ఎకానమీ రేటుతో 82 వికెట్లు సాధించాడు. అలాగే ఐపీఎల్లో 38 మ్యాచ్‌లు ఆడి, 7.41 ఎకానమీ రేటుతో 41 వికెట్లు పడగొట్టాడు.
మరో సీనియర్ బౌలర్ అశ్విన్ పై నమ్మకముంచారు టీమిండియా సెలక్టర్లు. అశ్విన్ అనుభవం జట్టుకు ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. అశ్విన్ అంతర్జాతీయ స్థాయిలో 46 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 6.97 ఎకానమీ రేటుతో 52 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో, అతను బ్యాట్‌తో పాటు బౌలింగ్‌తో చాలాసార్లు అద్భుతాలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక, ఈ మెగాటోర్నీలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంతో కీలకం కానున్నాడు. రుణ్ చక్రవర్తి, 2019 సంవత్సరంలో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడాడు. అతను 7.34 ఎకానమీ రేటుతో 25 వికెట్లు పడగొట్టాడు. అతను టీమిండియా తరఫున మూడు మ్యాచ్‌లలో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. కానీ పొదుపుగా బౌలింగ్ చేయడంలో దిట్ట.