టోక్యో ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. భారత బృందం మొత్తంగా ఏడు పతకాలు సాధించారు. నీరజ్ మిశ్రా (స్వర్ణం), మీరాబాయి చాను (రజతం), రవి దహియా (రజతం), పీవీ సింధు (కాంస్యం), లవ్లీనా (కాంస్యం), హాకీ పురుషుల జట్టు (కాంస్యం), బజరంగ్ పునియా (కాంస్యం) సాధించారు. ఈ వివరాలు అందరికీ తెలుసు. మరి వారి వెనుక ఉండి ముందుకు నడిపించింది ఎవరు? వారు ఏ దేశానికి చెందినవారు, మన వాళ్ల ఆటను గుర్తించి, ఎలాంటి మార్పులు చేశారు లాంటి వివరాలు మీ కోసం!
బంగారు బాబు నీరజ్ గురి వెనుక: జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణపతకం సాధించిన విషయం తెలిసిందే. దీని కోసం అతను చాలా రోజుల నుండి కఠోర శిక్షణ పొందుతున్నాడు. అతనికి హెడ్ కోచ్‌గా యు హోన్, బయోకెమికల్ ఎక్స్‌పర్ట్‌గా డాక్టర్ క్లాస్ బార్టోనిజ్ వ్యవహరించారు. నీరజ్ మరింత స్ట్రాంగ్ అవ్వడానికి క్లాస్‌నే కారణమట. అలాగే కోచ్ హోన్ సంగతి చూస్తే... అతను జావెలిన్‌ను 100 మీటర్ల దూరం విసిరిన ఘనుడు. జర్మనీకి చెందిన ఈ ఇద్దరు గతంలో చైనా జాతీయ టీమ్‌కి సేవలందించారు. (Image:Olympics)
మన మీరా బాయి విజయం వెనుక: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు రజతం తీసుకొచ్చింది మీరా బాయి చాను. ఆమెను అంతలా పతకంవైపు నడిపించిన గురువు మన దేశస్తుడే. పేరు విజయ్ శర్మ. ఆయన చీఫ్ నేషనల్ కోచ్. మడమ గాయం వల్ల వెయిట్‌లిఫ్టింగ్ కెరీర్‌ను మధ్యలో ముగించిన విజయ్ శర్మ... మీరా బాయి చానును రజతం వరకు తీసుకొచ్చారు. ఆమెను మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసి పతకం సాధించేలా చేశారు.
రవి కసికి కారణం ఇతనే: రెజ్లర్ అంటే హైఎమోషన్స్ను కూడా కంట్రోల్ చేసుకోగలగాలి. అలా రవి కుమార్ దహియాను పూర్తి కంట్రోల్లో ఉంచి, పతకం సాధించేలా చేసిన వ్యక్తి కమల్ మాలికోవ్. రష్యాకి చెందిన ఈయన ఫిట్నెస్ ట్రైనర్. ఆయన రవి దహియాతో ఈ ఏడాది ఏప్రిల్ నుండి కలసి ఉన్నారు. ఈ క్రమంలో రవికి అవసరమైన మెళకువలు నేర్పి, పోటీకి సిద్ధం చేసి పతకం సాధించేలా చేశాడు.
బజరంగ్ భాయిజాన్ బలం: బజరంగ్ ఈ ఏడాది పతకం తీసుకొచ్చే వారి లిస్ట్‌లో తొలుత నుండీ ఉన్నాడు. అందుకు తగ్గట్టే ఆడాడు కూడా. అయితే ఆఖరులో ఇబ్బందిపడ్డాడు... దీంతో కాంస్యానికి పరిమితం అయిపోయాడు. ఈ ఘనత వెనుక ఉన్నది జార్జియాకు చెందిన షాకో బెన్టిండిస్. బజరంగ్ లోటుపాట్లను చక్కగా గుర్తించి...అవసరమైన మార్పులు చేసి పతకధారిని చేశాడు. (Image:ANI)
లవ్లీనా అదరగొట్టి పతకధారి అయ్యిందంటే.! : లవ్లీనా ఒలింపిక్స్ పతకం సాధించింది అంటే అందులో ముఖ్య కారకుల్లో ఇటలీకి చెందిన రాఫెల్ బెర్గామస్కో. హై పెర్ఫార్మెన్స్ డైరక్టర్‌గా లవ్లీనాను చక్కగా మార్గనిర్దేశం చేసి కాంస్యం గెలుచుకునేలా చేశారు. ఆయన తండ్రి కూడా ఒలింపియన్ కావడం గమనార్హం. అంతేకాదు బెర్గామస్కో కెరీర్లో ఆటగాడిగా ఐదు జాతీయ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్నాడు. బీజింగ్, లండన్, రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు కూడా. (SAI Media / Twitter)
తెలుగు తేజం పీవీ సింధు విజయ కారణం: పీవీ సింధు ఒలింపిక్ పతకం సాధించింది అంటే ఆమె కృషి ఎంతో మనందరికీ తెలుసు. మరి ఆమె నమ్మకం, ధైర్యం, కృషి వెనుక ఉన్నది పార్క్ టే సంగ్. దక్షిణ కొరియాకు చెందిన పార్క్.., పీవీ సింధుకు మార్గదర్శిగా నిలిచి పతకం సాధించేలా చేశాడు. ఆమె ఆటలో వెరైటీ పెరిగితే విజయం తథ్యం అని భావించి పెంచి చూపించాడు. పతకం సాధించేలా చేశాడు. అందుకుతగ్గట్టే సింధు... యమగూచి లాంటి ప్లేయర్లను దాటుకుంటూ కాంస్యం గెలుచుకుంది. పార్క్ మామూలోడు కాడు అందరూ మురిసిపోతోంది అందుకే. (SAI Media / Twitter)
రికార్డు సాధించిన పురుషుల హాకీ కోచ్ ఈయనే: 41 ఏళ్ల తర్వాత పురుషుల హాకీ టీమ్ ఒలింపిక్స్ పతకం గెలుచుకుతంది. అంతటి ఘనత సాధించిన జట్టును మార్గదర్శిగా నిలిచిన కోచ్ గురించి తెలుసుకోవాలిగా. అతనే గ్రాహమ్ రీడ్. ఆస్ట్రేలియాకు చెందిన రీడ్... భారత జట్టు తప్పులను గుర్తించి సరి చేశాడు. అందుకే పతకం సాధించగలిగాం అని చెప్పొచ్చు. బెల్జియంతో సెమీస్‌లో ఓడిపోయాక... జర్మనీతో కాంస్యం కోసం జరిగిన పోరులో రీడ్ ఎంతగా ప్రోత్సహించాడో ఆట చూసినవాళ్లందరికీ తెలుసు. గెలిచాక సంబరాలు కూడా చూసే ఉంటారు. (SAI Media / Twitter)
గెలిచిన వాళ్ల గురించి గత కొద్ది రోజులుగా వార్తలు, కథనాలు చదువుతూనే ఉన్నారు. అందుకే ఫర్ ఏ ఛేంజ్ అన్నట్లు అలాంటి విజయాలు సాధించినవారి వెనుక ఎవరున్నారో చెప్పే ఉద్దేశమే ఈ కథనం. ఇందులో మీరు చూసుకుంటే ఏడుగురు విదేశీయులు, ఒక మన దేశం వ్యక్తి ఉన్నారు. ఎవరికి వారు, వారి ఆటలో దిట్టే. అందుకే తమ శిష్యుల్ని బాగా సానబెట్టి మన దేశానికి పతకాలు వచ్చేలా చేశారు. వచ్చే ఒలింపిక్స్ సమయానికి మన వాళ్లను ఇంకెంత సిద్ధం చేస్తారో.