ఇక వెంకటేశ్ అయ్యర్ రాకతో హార్దిక్ పాండ్యా కెరీర్ ముగిసినట్లేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2017లో అతనికి అయిన వెన్ను గాయం హార్దిక్ కెరీర్‌ను దెబ్బతీసింది. ఆ తర్వాత మునపటి ఫామ్ చూపలేకపోయిన పాండ్యా గాయాలతో సతమతమయ్యాడు. జట్టులోకి వస్తూ పోతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి అండగా నిలిచిన రాణించలేకపోయాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనే బౌలింగ్ ప్రారంభించినా.. అది జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. శ్రీలంక పర్యటన, ఐపీఎల్లో దారుణంగా విఫలమైన పాండ్యాను టీ20 ప్రపంకప్‌కు ఎంపిక చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలోనే కొత్తగా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్ ముందుగా జట్టు కాంబినేషన్‌పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా కార్యచరణను ప్రారంభించనున్నాడు ద్రావిడ్. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్లో ఓ పేస్ ఆల్‌రౌండర్ ఉండటం కీలకమని భావించిన ద్రావిడ్.. యువ ఆటగాడైన వెంకటేశ్ అయ్యర్ పై ఫోకస్ చేశాడు. హార్దిక్ మునపటిలా సత్తా చాటకపోవడంతో అతనికి ప్రత్యామ్నాయ ఆటగాడిని సిద్దం చేసుకోవడం ఉత్తమమని ద్రావిడ్ భావించినట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్ సిరీస్ లో వెంకటేశ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటాడు. కోల్‌కతా మ్యాచ్‌లో మూడు ఓవర్లల్లో 12 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడగా రాణిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయడానికి వెంకటేష్ అయ్యర్ రూపంలో ఓ ప్రత్యామ్నాయం లభించినట్టేనని భావిస్తున్నారు.